- విజిట్ చేసిన ఆకునూరి మురళి
- అక్కడి విద్యాశాఖ మంత్రిని కలిసి సంస్కరణలపై చర్చ
హైదరాబాద్, వెలుగు: కర్నాటకలో ప్రభుత్వ బడులు కార్పొరేట్‌కు దీటుగా తయారయ్యాయని.. అక్కడ అమలు చేస్తున్న సంస్కరణలు అద్భుతంగా ఉన్నాయని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ప్రశంసించారు. గురువారం ఆయన బెంగళూరులో కర్నాటక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్పను కలిశారు.
అంతకుముందు బెంగళూరులోని నార్త్, సౌత్ జిల్లాల్లో నడుస్తున్న ‘కర్నాటక పబ్లిక్ స్కూల్స్’ను స్వయంగా వెళ్లి పరిశీలించారు. అక్కడి బడుల తీరు, స్టూడెంట్లకు అందుతున్న సౌకర్యాలు చూసి ఆకునూరి మురళి ప్రశంసించారు. ఎల్కేజీ నుంచి 12వ తరగతి వరకు సర్కారు బడుల్లో ఉదయం రాగి మాల్ట్ కలిపిన పాలు ఇస్తున్నారని గుర్తించారు.
స్కూళ్లకు అడిషనల్ టీచర్లను ఇవ్వడం, సెక్యూరిటీ సిబ్బందిని, పరిసరాలను శుభ్రం చేసేందుకు, టాయ్ లెట్లు క్లీన్ చేసేందుకు అడిషనల్ వర్కర్లను కేటాయించడం బాగుందని తెలిపారు. ప్రతి తరగతికి ఒక క్లాస్ రూమ్, లైబ్రరీలు, లేబొరేటరీలు తదితర పూర్తి సౌకర్యాలు ఇవ్వడం గమనించారు. గోడలపై అందమైన ఆర్ట్స్ వేయించారు.
టెన్త్, 12వ తరగతికి మూడు సార్లు పరీక్షలు పెట్టడం.. ఒకవేళ ఫెయిల్ అయితే అదనంగా రెండు సార్లు పరీక్షలు పెట్టి ఎక్కువ మంది పాస్ అయ్యేలా చూడటం పరిశీలించారు. అలాగే, ఎగ్జామ్ రాసే రూమ్‌లో వెబ్ కాస్టింగ్ పెట్టి మాస్ కాపీయింగ్ ను అరికట్టడం లాంటి అనేక సంస్కరణలు చాలా గొప్పగా ఉన్నాయని ఆకునూరి మురళి అక్కడి మంత్రిని ప్రశంసించారు.
