
న్యూఢిల్లీ: తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్న ఢిల్లీ ప్రజలకు హర్యానా సర్కారు మరిన్ని నీళ్లు విడుదల చేయాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంత్రి ఆతిశీ చేపట్టిన నిరాహార దీక్ష సోమవారం నాలుగోరోజుకు చేరుకుంది. ఈమేరకు డాక్టర్లు ఆమెకు హెల్త్ చెకప్ చేశారు. దీక్ష కారణంగా ఆతిశీ ఆరోగ్యం క్షీణిస్తోందని పేర్కొన్నారు. వెంటనే ఆస్పత్రిలో చేరాలని సూచించారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. హర్యానా రాష్ట్రం తమకు నీళ్లను విడుదల చేసేదాకా తాను దీక్ష విరమించబోనని తేల్చి చెప్పారు. ఢిల్లీ ప్రజల కోసం పోరాడుతానన్నారు. ఆస్పత్రిలో చేరేందుకు కూడా ఆమె నిరాకరించారు. ‘‘బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయి. బరువు తగ్గుతున్నా. హెల్త్ పరంగా ఇది నాకు దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీయొచ్చు. అయినాసరే, హర్యానా నీళ్లిచ్చేదాకా నేను నిరాహార దీక్ష కొనసాగిస్తా”అని ఆతిశీ చెప్పారు.
మంత్రి హెల్త్ కండిషన్‌పై ఆప్ ఆందోళన
మంత్రి ఆతిశీ ఆరోగ్యం క్షీణిస్తోందని ఆప్ నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. బీపీ వేగంగా పడిపోతోందని, ఆతిశీ బరువు ఊహించని రీతిలో తగ్గుతోందని పేర్కొన్నారు. ‘జూన్ 21న నిరాహార దీక్ష చేపట్టిన రోజు ఆతిశీ బరువు 65.8 కిలోలుంటే సోమవారానికల్లా ఆమె 2.2 కిలోలు తగ్గారు. షుగర్ లెవెల్స్ 28 యూనిట్లు తగ్గాయి. బీపీకూడా పడిపోతోంది. ఢిల్లీ ప్రజల కోసం ఆతిశీ తన ప్రాణాలు పణంగా పెట్టి
పోరాడుతున్నారు” అని ప్రకటనలో తెలిపారు.
కేంద్రానికి ఆప్ మంత్రుల లేఖ
నీటి సమస్యకు అత్యవసర పరిష్కారం చూపాలంటూ ఢిల్లీ కేబినెట్ మంత్రులు కేంద్రానికి సోమవారం లేఖ రాశారు. సాధ్యమైనంత తొందరగా ఢిల్లీకి తాగునీటి కొరతను తీర్చాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినట్లు మంత్రి గోపాల్ రాయ్ మీడియాకు తెలిపారు.