- టీడీపీ, జేడీయూలకు ఆప్ ఎంపీ సంజయ్ సూచన
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ పదవి కోసం పట్టుబట్టాలంటూ బీజేపీ మిత్రపక్షాలు టీడీపీ, జేడీయూలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ సూచించారు. మంత్రివర్గంలో కీలకమైన శాఖలను దక్కించుకోలేకపోయారని, కనీసం స్పీకర్ పదవినైనా ఆ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీ దక్కించుకోవాలని చెప్పారు. ఇది రాజ్యాంగం, ప్రజాస్వామ్య ప్రయోజనాలతో పాటు వారి ప్రయోజనాలకు కూడా ఉపయోగపడుతుందని అన్నారు.
మంగళవారం సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ మిత్రపక్షాలకు చెప్పుకోదగ్గ మంత్రిత్వ శాఖలేవీ రాలేదన్నారు. కీలకమైన శాఖలన్నింటినీ బీజేపీ తమ వద్దే ఉంచుకుని, ఎన్డీయే భాగస్వాములకు ప్రాముఖ్యత లేని శాఖలు కట్టబెట్టిందని సింగ్ విమర్శించారు. జేడీయూ, టీడీపీలలో ఏదో ఒక పార్టీ నుంచి స్పీకర్ ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇండియా కూటమిలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్, హర్యానా, గుజరాత్, అస్సాంలో 22 లోక్‌సభ స్థానాలలో పోటీ చేసి.. కేవలం పంజాబ్‌లో మూడు సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది.