
నార్నే నితిన్, నయన్ సారిక జంటగా అంజి కె మణిపుత్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆయ్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నార్నే నితిన్ మాట్లాడుతూ ‘ఇదొక అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈ చిత్రానికి ‘ఆయ్’ అనే టైటిల్‌ను అల్లు అరవింద్ గారు పెట్టారు. గోదావరి స్లాంగ్‌లో ఆయ్ అనే పదాన్ని కామన్‌గా వాడుతుంటాం. అందుకే దీన్ని ఫిక్స్ చేశారు. దర్శకుడు అంజి అమలాపురం కుర్రాడు.
ఆయనకున్న ఫ్రస్ట్రేషన్స్, లైఫ్‌లో ఆయన చూసినవన్నీ కలిపి చేసిన సినిమానే ఇది. నయన్ సారిక మరాఠీ అమ్మాయి అయినా తెలుగమ్మాయిలా ఉంటుంది. తన పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది. నేను, అంకిత్ కొయ్య, కసిరెడ్డి ఫ్రెండ్స్‌గా నటించాం. మా జర్నీ ఫన్ ఫుల్‌గా ఉంటుంది. కులం, మతం కంటే స్నేహం చాలా గొప్పది అని.. ఇందులో మెసేజ్‌ను ఇస్తున్నాం. రామ్ మిరియాల మ్యూజిక్ సినిమాకు ప్లస్ అవుతుంది. ఇక ట్రైలర్ చూసిన ఎన్టీఆర్ (బావ) గారు చాలా ఎంజాయ్ చేశారు. ఆయనకు కామెడీ బాగా నచ్చింది. అలాంటి రెస్పాన్సే ప్రేక్షకుల నుంచి కూడా వస్తుందనుకుంటున్నాం. ప్రస్తుతం ‘మ్యాడ్2’ మూవీ చేస్తున్నా. ఈ ఏడాదిలోనే రిలీజ్ ఉండొచ్చు’ అని చెప్పాడు.