AB de Villiers: అసలైన జాక్ పాట్ చెన్నైదే.. 9 ఐపీఎల్ జట్లను విమర్శించిన డివిలియర్స్

AB de Villiers: అసలైన జాక్ పాట్ చెన్నైదే.. 9 ఐపీఎల్ జట్లను విమర్శించిన డివిలియర్స్

సౌతాఫ్రికా చిచ్చర పిడుగు డెవాల్డ్ బ్రెవిస్ ఆస్ట్రేలియాపై సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. ఆడుతుంది ఆస్ట్రేలియా గడ్డపై అయినా వెనక్కి తగ్గలేదు. మంగళవారం (ఆగస్టు 12) డార్విన్ వేదికగా మర్రారా క్రికెట్ గ్రౌండ్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ సఫారీ కుర్రాడు ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీ చేశాడు.మొదట కాస్త ఆచితూచి ఆడిన ఈ సఫారీ 22 ఏళ్ళ కుర్రాడు ఆ తర్వాత  ఓ రేంజ్ లో కంగారులపై విరుచుకుపడ్డాడు. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న బ్రెవిస్.. ఆ తర్వాత మరింత రెచ్చిపోయి 41 బంతుల్లోనే తన అంతర్జాతీయ కెరీర్ లో తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఓవరాల్ గా 56 బంతుల్లో 12 ఫోర్లు, 8సిక్సర్లతో 125 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ సెంచరీతో ప్రపంచానికి తాను ఎంత ప్రమాదకర బ్యాటర్ అనే విషయాన్ని చెప్పాడు.  

బ్రెవిస్ ఆటకు ఏబీ డివిలియర్స్ ఫిదా అయ్యాడు. ఈ 22 ఏళ్ళ యువ క్రికెటర్ పై ప్రశంసలు కురిపించాడు. ఈ సఫారీ ఆటగాడిని నిర్లక్ష్యం చేసినందుకు ఐపీఎల్ జట్లను విమర్శించాడు. బ్రెవిస్ తో ఒప్పందం కుదుర్చుకునే సువర్ణావకాశాన్ని 9 ఐపీఎల్ జట్లు కోల్పోయాయని..  ఏ విషయంలో చెన్నై సూపర్ కింగ్స్ చాలా లక్కీ అని డివిలియర్స్ తెలిపాడు. "వేలంలో డెవాల్డ్ బ్రెవిస్‌ను తీసుకోవడానికి ఐపీఎల్ జట్లకు  సువర్ణావకాశం వచ్చింది. ఒక్కరు కూడా అతనిపై ఆసక్తి చూపించకుండా బ్రెవిస్ ను మిస్ చేసుకున్నారు. CSK చాలా లక్కీ. బహుశా ఇప్పటివరకు ఇదే అతిపెద్ద మాస్టర్ స్ట్రోక్ కావచ్చు". అని డివిలియర్స్ తన ఎక్స్ ద్వారా రాసుకొచ్చాడు. 

ఐపీఎల్ 18 ఎడిషన్‎లో దారుణంగా విఫలమవుతోన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బ్రెవిస్ వరంలా దొరికాడు. జూనియర్ ఏబీ డివిలియర్స్‎గా పేరుగాంచిన డెవాల్డ్ బ్రెవిస్ ను చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు దక్కించుకుంది. మెగా ఆక్షన్ లో ఒక్కరు కూడా ఆసక్తి చూపించకపోయినా చెన్నై ఐపీఎల్ 2025 సీజన్ మధ్యలో తీసుకొని జాక్ పాట్ కొట్టేసింది. చెన్నై జట్టులోకి చేరినప్పటి నుంచి ఈ సఫారీ యువ క్రికెటర్ ఓ రేంజ్ లో చెలరేగి ఆడుతున్నాడు. సూపర్ కింగ్స్ తరపున అద్భుతంగా ఆడి.. అదే ఫామ్ ను అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగిస్తున్నాడు.