AB de Villiers: క్రికెట్‌లో రాజకీయాలు పక్కన పెట్టాలి.. టీమిండియా తీరుపై డివిలియర్స్ తీవ్ర విమర్శలు

AB de Villiers: క్రికెట్‌లో రాజకీయాలు పక్కన పెట్టాలి.. టీమిండియా తీరుపై డివిలియర్స్ తీవ్ర విమర్శలు

పాకిస్థాన్ తో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఆదివారం (సెప్టెంబర్ 28) దుబాయ్ ఇంటర్నేషనల్ లో జరిగిన ఈ తుది సమరంలో పాకిస్థాన్ పై 5 వికెట్ల తేడాతో గెలిచి రికార్డ్ స్థాయిలో తొమ్మిదోసారి ఆసియా కప్ కైవసం చేసుకుంది.తిలక్ వర్మ (53 బంతుల్లో 69: 3 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచిత ఇన్నింగ్స్ తో  ఇండియాను గెలిపించాడు. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో టీమిండియా సంబరాలు అంబరాన్ని అంటాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత ఊహించినట్టుగానే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి టీమిండియా నిరాకరించింది. 

ఆసియా క్రికెట్ కౌన్సిల్‌‌ ప్రెసిడెంట్‌‌గా ఉన్న పాకిస్తాన్ బోర్డు చైర్మన్, ఆ దేశ మంత్రి మోహ్‌‌సిన్ నఖ్వీ  నుంచి ఆసియా కప్ ట్రోఫీని, విన్నర్ మెడల్స్‌‌ను అందుకునేందుకు ఇండియా ఒప్పుకోలేదు. ప్రెజెంటేషన్ సెర్మనీ తర్వాత చేతులో టైటిల్ లేకుండానే ట్రోఫీ అందుకున్నట్టు ఊహించుకుంటూ టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సెలెబ్రేషన్ చేసుకున్నాడు. ప్రెజెంటేషన్ వేడుక తర్వాత ఆసియా  క్రికెట్ కౌన్సిల్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ నఖ్వీ ట్రోఫీతో స్టేడియం నుండి బయలుదేరారు. టీమిండియా తీరుపై సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ తప్పుపట్టారు. క్రికెట్ ను రాజకీయాలకు లింక్ చేయొద్దని తెలిపాడు.   

"ట్రోఫీని అందజేసే వ్యక్తితో టీమిండియా అసంతృప్తిగా కనిపించింది. అది క్రీడలకు సంబంధించినదని నేను భావించడం లేదు. క్రీడల్లో  రాజకీయాలు పక్కన పెట్టాలి.  క్రికెట్ కు క్రికెట్ గానే చూడాలి. ట్రోఫీకి నిరాకరించడం చూడడానికి చాల విచారకరంగా అనిపించింది. కానీ భవిష్యత్తులో ఇలాంటి విషయాలను పరిష్కరిస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు ఆటగాళ్లను చాలా ఇబ్బందికి గురి చేస్తాయి. ఇలాంటి సంఘటనలు చూడడానికి నేను ఇష్టపడను. చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అని డివిలియర్స్ యూట్యూబ్‌ #360 కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు.    

ట్రోఫీ కావాలంటే వచ్చి తీసుకెళ్లండి:
 
ఇండియాకు ట్రోఫీ కావాలంటే దుబాయ్‌‌లోని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ( ఏసీసీ) హెడ్‌‌ ఆఫీస్‌‌లో తన వద్దకు వచ్చి తీసుకోవచ్చని ఏసీసీ ప్రెసిడెంట్‌‌, పాకిస్తాన్ మంత్రి మోహ్‌‌సిన్ నఖ్వీ బుధవారం రెచ్చగొట్టే ప్రకటన చేశాడు. ట్రోఫీని ఇండియాకు అప్పగించకపోవడంతో ఏసీసీ ఏజీఎంలో బీసీసీఐ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాను బీసీసీఐకి క్షమాపణ చెప్పినట్లు వచ్చిన వార్తలను నఖ్వీ ఎక్స్‌‌ వేదికగా ఖండించాడు. ‘నేను బీసీసీఐకి ఎప్పుడూ క్షమాపణ చెప్పలేదు.  ఎప్పటికీ చెప్పను.  ఏసీసీ ప్రెసిడెంట్‌‌గా  ఆ రోజు ట్రోఫీని అందించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పుడూ సిద్ధంగానే ఉన్నాను. వాళ్లకు (ఇండియా)ట్రోఫీ కావాలంటే ఏసీసీ ఆఫీస్‌‌కు వచ్చి నా నుంచి తీసుకోవచ్చు’ అని పోస్ట్ చేశాడు.