ప్రజలకు సంబంధించి అయోధ్య వివాదం క్లోజ్

ప్రజలకు సంబంధించి అయోధ్య వివాదం క్లోజ్

న్యూఢిల్లీ: ప్రజలకు సంబంధించి అయోధ్య వివాదం ముగిసిపోయిందని మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్​ అబ్బాస్​ నఖ్వీ చెప్పారు. అన్ని వర్గాల ప్రజలూ సుప్రీం తీర్పును స్వాగతించారని మంత్రి ఆదివారం ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సుప్రీం తీర్పు తర్వాత సమాజంలో పెరిగిన ఐకమత్య భావనను దెబ్బతీయడానికి కొంతమంది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల్లో పెరిగిన యూనిటీని జీర్ణించుకోలేకపోతున్నారంటూ ముస్లిం పర్సనల్​లా బోర్డు, జమైతే ఉలేమా హింద్​ సంస్థలను ఆయన పరోక్షంగా విమర్శించారు. ‘ముస్లింలకు ఇప్పుడు మసీదు ముఖ్యం కాదు.. విద్య, ఆర్థిక, సామాజిక అభివృద్ధి ముఖ్యం’ అని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎలాంటి అభిప్రాయాన్నైనా కలిగి ఉండొచ్చని, ఎవరైనా సరే కోర్టులను ఆశ్రయించొచ్చని మంత్రి చెప్పారు. ఈ నెల 3 లేదా 4న అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్​ దాఖలు చేస్తామని జమైతే, 9న రివ్యూ కోరతామని ముస్లిం లా బోర్డు గతంలోనే ప్రకటించాయి. పిటిషన్​కు సంబంధించి ఇప్పుడు డ్రాఫ్ట్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీనిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సమాజంలో చీలిక తేవాలన్నదే వాళ్ల ఉద్దేశమని ఆరోపించారు. తమ వాదనను మొత్తం సమాజంపై రుద్దాలన్న ప్రయత్నం సరికాదని ముక్తార్​ అబ్బాస్ నఖ్వీ గుర్తుచేశారు.