
ఆసియా కప్ సూపర్-4 లో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా తడబడుతోంది, బౌలింగ్ లో గాడి తప్పిన భారత జట్టు పేలవ ఫీల్డింగ్ తో ప్రత్యర్థి పాకిస్థాన్ కు పట్టు వచ్చేలా చేసుకున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం (సెప్టెంబర్ 21) ప్రారంభమైన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేస్తున్న పాకిస్థాన్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 91 పరుగులు చేసి ఇండియాపై ఆధిపత్యం చూపించింది.
అభిషేక్ రెండు.. కుల్దీప్ ఒకటి:
ఈ మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ రెండు క్యాచ్ లు జారవిడిచాడు. రెండు కూడా సాహిబ్జాదా ఫర్హాన్ వే. హార్దిక్ పాండ్య వేసిన తొలి ఓవర్లో పాయింట్ దగ్గర క్యాచ్ మిస్ చేసిన అభిషేక్.. వరుణ్ చక్రవర్తి వేసిన 8 ఓవర్లో లాంగన్ దగ్గర మరో క్యాచ్ మిస్ చేశాడు. కుల్దీప్ యాదవ్ కూడా సైమ్ క్యాచ్ మిస్ చేయడం తీవ్ర ప్రభావం చూపుతోంది. టీ20 లాంటి టోర్నీల్లో ఒక క్యాచ్ మిస్ చేయడం మ్యాచ్ పై ఎంతో ప్రభావం చూపిస్తుంది. కానీ మన జట్టు మాత్రం పాకిస్థాన్ ఆటగాళ్లకు మూడు అవకాశాలు ఇచ్చారు. మరి ఈ మ్యాచ్ లో క్యాచ్ మిస్సింగ్.. ఇండియాకు ఎంత ప్రతికూలంగా మారుతుందో చూడాలి.
తొలి 10 ఓవర్లలో 91 పరుగులు:
లీగ్ దశలో బ్యాటింగ్ లో పెద్దగా రాణించని పాకిస్థాన్ సూపర్-4 లో అద్భుతంగా రాణిస్తోంది. తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 91 పరుగులు చేసి భారీ స్కోర్ పై కన్నేసింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ 37 బంతుల్లో 52 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. ఫకర్ జమాన్ (5) విఫలం కాగా.. సైమ్ అయూబ్ 21 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇండియన్ బౌలర్లలో హార్దిక్ పాండ్యకు ఒక వికెట్ దక్కింది.