అభిషేక్‌‌ చేసిండు... ఆసియా కప్‌‌ ఫైనల్లో ఇండియా

అభిషేక్‌‌ చేసిండు... ఆసియా కప్‌‌ ఫైనల్లో ఇండియా
  • 41 రన్స్‌‌ తేడాతో బంగ్లాదేశ్‌‌పై గెలుపు
  • రాణించిన హార్దిక్‌‌, గిల్‌‌, కుల్దీప్‌‌

దుబాయ్‌‌: ఆసియా కప్‌‌లో టీమిండియా ఫైనల్‌‌ బెర్త్‌‌ను ఖాయం చేసుకుంది. బ్యాటింగ్‌‌లో అభిషేక్‌‌ శర్మ (37 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 5 సిక్స్‌‌లతో 75), హార్డిక్‌‌ పాండ్యా (29 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 38) దంచికొట్టడంతో.. బుధవారం జరిగిన సూపర్‌‌–4 మ్యాచ్‌‌లో ఇండియా 41 రన్స్‌‌ తేడాతో బంగ్లాదేశ్‌‌ను ఓడించింది. టాస్‌‌ ఓడిన ఇండియా 20 ఓవర్లలో 168/6 స్కోరు చేసింది. తర్వాత బంగ్లాదేశ్‌‌ 19.3 ఓవర్లలో 127 రన్స్‌‌కే ఆలౌటైంది. సైఫ్‌‌ హసన్‌‌ (51 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 5 సిక్స్‌‌లతో 69) టాప్‌‌ స్కోరర్‌‌. పర్వేజ్‌‌ హసన్‌‌ (21) ఫర్వాలేదనిపించినా.. మిగతా వారందరూ సింగిల్‌‌ డిజిట్‌‌కే పరిమితమయ్యారు. అభిషేక్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

ఓపెనర్లు అదుర్స్‌‌..

ముందుగా బ్యాటింగ్‌‌కు దిగిన ఇండియాకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. తొలి ఓవర్‌‌లో మూడు రన్సే వచ్చినా రెండో ఓవర్‌‌లో అభిషేక్‌‌ బౌండ్రీతో టచ్‌‌లోకి వచ్చాడు. తర్వాతి ఓవర్‌‌లో 7 రన్సే రాగా, నాలుగో ఓవర్‌‌లో శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (29) 4, 6తో రెచ్చిపోయాడు. ఇదే ఓవర్‌‌లో సిక్స్​తో బ్యాట్‌‌ ఝుళిపించిన అభిషేక్‌‌ ఐదో ఓవర్‌‌లో డబుల్‌‌ సిక్సర్లు బాదాడు. ఇక ఆరో ఓవర్‌‌లో నాలుగు ఫోర్లు దంచాడు. ఫలితంగా పవర్‌‌ప్లేలో ఇండియా 72/0 స్కోరుతో పటిష్ట  స్థితిలో నిలిచింది. కానీ ఫీల్డింగ్‌‌ను విస్తరించిన తర్వాత ఏడో ఓవర్‌‌లో రిషాద్‌‌ హుస్సేన్‌‌ (2/27).. గిల్‌‌ను బోల్తా కొట్టించాడు. తొలి వికెట్‌‌కు 77 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. 

ఈ వెంటనే అభిషేక్‌‌ 25 బాల్స్‌‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. 9వ ఓవర్‌‌లో రిషాద్.. శివమ్‌‌ దూబే (2)ను ఔట్‌‌ చేసి మళ్లీ ఝలక్‌‌ ఇచ్చాడు. ఈ ఓవర్‌‌లో అభిషేక్‌‌ సిక్స్‌‌ బాదడంతో ఫస్ట్‌‌ టెన్‌‌లో స్కోరు 90/2కు పెరిగింది. 11వ ఓవర్‌‌లో 6, 4తో అభిషేక్‌‌ జోరు కొనసాగించినా.. 12వ ఓవర్‌‌లో ఇండియాకు డబుల్ స్ట్రోక్‌‌ తగిలింది. అభిషేక్‌‌ రనౌట్‌‌ కాగా, లాస్ట్‌‌ బాల్‌‌కు సూర్య కుమార్‌‌ (5) ఔటయ్యాడు. 114/4 వద్ద వచ్చిన హార్దిక్‌‌ సిక్స్‌‌తో శుభారంభం చేయగా, రెండో ఎండ్‌‌లో సహకారం కరువైంది. 

15వ ఓవర్‌‌లో తిలక్‌‌ వర్మ (5) వెనుదిరగడంతో స్కోరు 132/5గా మారింది. అక్షర్‌‌ పటేల్ (10 నాటౌట్‌‌) స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేయగా బంగ్లా బౌలర్లు కట్టడి చేశారు. ఈ మధ్యలో హార్దిక్‌‌ నాలుగు ఫోర్లు రాబట్టడంతో ఏడో వికెట్‌‌కు 39 రన్స్‌‌ జతయ్యాయి. 

సైఫ్‌‌ ఒక్కడే..

ఛేజింగ్‌‌లో బంగ్లాకు సైఫ్‌‌ హసన్‌‌ మెరుపు ఆరంభాన్నిచ్చినా మిగతా వారు ఘోరంగా తేలిపోయారు. 4 రన్స్‌‌ వద్ద తన్జిద్‌‌ హసన్‌‌ (1) ఔటయ్యాడు. పర్వేజ్‌‌ హుస్సేన్‌‌ ఉన్నంతసేపు మెరుగ్గా ఆడాడు. పవర్‌‌ ప్లే ముగిసేసరికి రెండో వికెట్‌‌కు 42 రన్స్‌‌ జోడించి ఔటయ్యాడు. ఆ వెంటనే వరుస విరామాల్లో తౌహిద్‌‌ హ్రిదోయ్‌‌ (7), షామిమ్‌‌ హుస్సేన్‌‌ (0), జాకెర్‌‌ అలీ (4) వెనుదిరిగారు. దాంతో 87 రన్స్‌‌కే సగం జట్టుకు పెవిలియన్‌‌కు చేరింది.  36 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ చేసిన సైఫ్‌‌14వ ఓవర్‌‌లో రెండు సిక్సర్లతో వేగం పెంచాడు. 

మహ్మద్‌‌ సైఫుద్దీన్‌‌ (4) సింగిల్స్‌‌ తీయడంతో బంగ్లా స్కోరు​ 15 ఓవర్లలో 108/5గా మారింది. 16వ ఓవర్‌‌లో సైఫ్‌‌ ఇచ్చిన క్యాచ్‌‌ను దూబే డ్రాప్‌‌ చేయగా, తర్వాతి బాల్‌‌కు సైఫుద్దీన్‌‌ ఇచ్చిన క్యాచ్‌‌ను తిలక్‌‌ సూపర్‌‌గా అందుకున్నాడు. తర్వాతి ఓవర్‌‌లో కుల్దీప్‌‌ (3/18) వరుసగా రిషాద్‌‌ హుస్సేన్‌‌ (2), తన్జిద్‌‌ హసన్‌‌ (0)ను ఔట్‌‌ చేశాడు. 18వ ఓవర్‌‌లో బుమ్రా (2/18) సైఫ్‌‌ను, లాస్ట్‌‌లో తిలక్‌‌ వర్మ (1/1).. ముస్తాఫిజుర్‌‌ (6)ను ఔట్‌‌ చేయడంతో బంగ్లా టార్గెట్‌‌ను అందుకోలేకపోయింది. వరుణ్‌‌ రెండు వికెట్లు తీశాడు. 

సంక్షిప్త స్కోర్లు

ఇండియా: 20 ఓవర్లలో 168/6 (అభిషేక్‌‌ 75, హార్దిక్‌‌ 38, రిషాద్‌‌ 2/27). 

బంగ్లాదేశ్‌‌: 19.3 ఓవర్లలో 127 ఆలౌట్‌‌ (సైఫ్‌‌ హసన్‌‌ 69, పర్వేజ్‌‌ 21, కుల్దీప్‌‌ 3/18).