మోడల్ ఆత్మహత్య.. పోలీసుల విచారణలో SRH క్రికెటర్ పేరు

మోడల్ ఆత్మహత్య.. పోలీసుల విచారణలో SRH క్రికెటర్ పేరు

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఆల్ రౌండర్ అభిషేక్ శర్మ వివాదంలో చిక్కుకున్నాడు. సూరత్‌కు చెందిన ప్రముఖ మోడల్ తానియా సింగ్ ఆత్మహత్య చేసుకోవడంతో అభిషేక్ శర్మకు స్థానిక పోలీసులు ఇటీవల నోటీసులు పంపించారు. గుజరాత్ టాక్ నివేదిక ప్రకారం.. 28 ఏళ్ల తానియా.. ఫ్యాషన్ డిజైనింగ్, మోడలింగ్ రంగంలో పనిచేస్తోంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 10,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.  డిస్క్ జాకీ, మేకప్ ఆర్టిస్ట్, మోడల్ అని ఆమె ఇన్‌స్టాగ్రామ్ బయోలో ఉంది. 

తానియా సింగ్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత పోలీసులు సూరత్‌లో తమ దర్యాప్తును ప్రారంభించారు. విచారణ జరుపుతుండగా.. SRH ప్లేయర్ అభిషేక్ శర్మ పేరు వచ్చింది. తానియా సింగ్‌తో ఈ క్రికెటర్ కొంతకాలంగా టచ్‌లో ఉన్నాడట. తానియా.. అభిషేక్ కు తన చివరి ఫోన్ కాల్ చేసినట్లు నివేదించబడింది. దీంతో సూరత్ పోలీసులు ఈ SRH ఆల్‌రౌండర్‌ని విచారణకు పిలిచారు.

అభిషేక్ శర్మ ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో పంజాబ్ జట్టు తరపున ఆడుతున్నాడు. పంజాబ్ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఈ సీజన్ లో అభిషేక్ శర్మ నాలుగు మ్యాచ్ ల్లో 28.42 సగటుతో 199 పరుగులు చేశాడు. బౌలింగ్ లో మూడు వికెట్లు పడగొట్టాడు. అభిషేక్ IPL 2024 సీజన్ కోసం సన్నద్ధమవుతన్నాడు. ఈ ఆల్ రౌండర్ ను సన్ రైజర్స్ రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. చివరి మూడు సీజన్‌లలో SRH ప్లే ఆఫ్ కు చేరుకోవడంలో విఫలమైనా.. అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.