
సంగారెడ్డి/జహీరాబాద్, వెలుగు : స్వాతంత్య్రానికి ముందు వికారాబాద్ నుంచి మహారాష్ట్రలోని పర్లి వరకు ఏర్పాటు చేసిన సాధారణ రైల్వే లైన్ ఇప్పుడు కొత్త హంగులతో ఎలక్ట్రిక్ లైన్ గా మారుతోంది. డీజిల్‌తో నడిచే రైళ్లను ఎలక్ట్రికల్ లైనింగ్ గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం 2017-18లో ప్రతిపాదించింది. 2020-21లో ఈ రూట్లో లైనింగ్ పనులకు ఆమోదం లభించగా, 269 కిలోమీటర్ల దూరంలో ఆయా పనులకు కేంద్రం రూ.312 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రతిపాదనలు రెడీ చేసింది. కాగా మొదటి విడుతగా వికారాబాద్ నుంచి జహీరాబాద్ మీదుగా బీదర్ వరకు దాదాపు 105 కిలోమీటర్ల మేర ఎలక్ట్రిక్ లైన్ పనులు ఇటీవల కంప్లీట్ అయ్యాయి.
ఇబ్బందులు తొలిగి..
గతంలో బీదర్ జిల్లాలోని ఖానాపూర్ జంక్షన్ వద్ద డీజిల్ ఇంజన్లను మార్చేవారు. ఎలక్ర్టిక్ రైళ్ల రాకతోవికారాబాద్–బీదర్ మార్గంలో సింగిల్ లైన్లో వచ్చే రైళ్ల రాకపోకలకు ఇంబ్బందులు తొలిగిపోయాయి. ఈ రూట్లో తిరిగే బీదర్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్, కాకినాడ- షిర్డి ఎక్స్‌ప్రెస్, బీదర్-మచిలీపట్నం సూపర్ ఫాస్ట్, యశ్వంత్‌పూర్–-బీదర్, ఔరంగ్నగర్–సికింద్రాబాద్, ఔరాద్, రేణిగుంట -తిరుపతి-జహీరాబాద్ మీదుగా బీదర్ వెళ్లే రైళ్లు ఇంజన్ మార్చుకోకుండా రాకపోకలు సాగిస్తున్నాయి. వికారాబాద్, మర్పల్లి, కోహీర్, జహీరాబాద్, మెటల్‌కుంట, రాజోల స్టేషన్ల మీదుగా కర్ణాటకలోని బీదర్ వరకు ఎలక్ర్టిక్ రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. ఈ రూట్లో వారం రోజులుగా ఎలక్ర్టిక్ రైళ్లు తిరుగుతుండటంతో స్థానిక ప్రాసింజర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఈ ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ఎట్టకేలకు ఆ కల సాకారమైందంటూ సంబరపడుతున్నారు.