90 కిలోమీటర్ల మేర గుంతలు, బురదే..ఎలా వెళ్లేది

 90 కిలోమీటర్ల మేర గుంతలు, బురదే..ఎలా వెళ్లేది
  •     మెదక్​జిల్లాలో 90 కిలోమీటర్ల మేర గుంతలు, బురదే..
  •     అధ్వానంగా మారిన గ్రామీణ ప్రాంతాల రోడ్లు 
     
  •     పలుచోట్ల నిలదీతలు, నిరసనలు 
  •     పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు

మెదక్/శివ్వంపేట/ కొల్చారం, వెలుగు : మెదక్​ జిల్లాలో దాదాపు 90 కిలోమీటర్ల మేర గ్రామీణ ప్రాంతాల రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. కనీసం కాలి నడకన వెళ్లే పరిస్థితి కూడా లేకపోతే ఎలా రాకపోకలు సాగించాలని స్థానికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి రోడ్ల దుస్థితితోనే ఇటీవల వెల్దుర్తి మండలం మహ్మద్​ నగర్​ గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దమ్మగడ్డ తండాకు చెందిన అక్షర(10) అనే బాలికకు సరైన సమయంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయింది.

శివ్వంపేట మండలంలోని రెడ్యా తండా రోడ్డు పూర్తిగా బురదమయంగా మారగా మంగళవారం ఈ రోడ్డు మీదనే రెడ్యా తండాకు చెందిన బాలింత మంజులను తీసుకొస్తున్న అమ్మ ఒడి వెహికల్​ బురదలో దిగబడింది. దీంతో బాలింత అరకిలో మీటరు దూరం నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. రోడ్లు బాగలేక ప్రాణాల మీదకు వస్తున్నా ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని ఆయా ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కిలోమీటర్ల మేర గుంతలే... 

శివ్వంపేట మండలంలో 22, కొల్చారం మండలంలో 12, కౌడిపల్లిలో 14, పెద్దశంకరంపేట మండలం పరిధిలో 2, చిలప్ చెడ్ మండలంలో  ఫైజాబాద్, బండ పోతుగల్, అజ్జమర్రి వరకు 5 కిలో మీటర్ల మేర రోడ్లు పనికిరాకుండా ఉన్నాయి. వెల్దుర్తి మండలం లో మహమ్మద్ నగర్ గ్రామపంచాయతీ పరిధిలోని నడిమి తండా రోడ్డు 2,  మెదక్ వెళ్లే రోడ్డు నుంచి ఏదులపల్లి వరకు 3 కిలోమీటర్లు రోడ్లు అధ్వానంగా  మారాయి.

చిన్నశంకరంపేట నుంచి జంగరాయి వరకు 3, చిన్నశంకరంపేట నుంచి మిర్జాపల్లి మీదుగా నార్సింగ్ వరకు 7 కిలో మీటర్ల మేర రోడ్లు దారుణంగా ఉన్నాయి. టేక్మాల్ నుంచి ఎల్లుపేట వరకు 7, టేక్మాల్- ఎలకుర్తి మధ్య 4, టేక్మాల్-- అచ్చన్నపల్లి మధ్య 6, ధనూర-దాదయిపల్లి  మధ్య 5, సూరంపల్లి నుంచి బొడగట్టు వరకు 2 కిలో మీటర్లు అదే పరిస్థితి ఉంది. 

ఎవరూ పట్టించుకోవట్లే.. 

శివ్వంపేట మండలం పోతులగూడ నుండి అనంతారం చౌరస్తా వరకు 16 కిలో మీటర్ల దూరం రోడ్డు పూర్తిగా  ధ్వంసమైంది. ఈ రూట్​లోని 10 గ్రామాల ప్రజలు, రైతులు, స్టూడెంట్స్​తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. సికింద్రాబాద్ నుంచి ఉసిరిక పల్లి, పాంబండ, పోతుల గూడ మీదుగా వెల్దుర్తికి వెళ్లే బస్సు రోడ్డు సరిగా లేక బంద్ అయ్యింది. దీంతో ఆయా గ్రామాల నుంచి ప్రతిరోజు సికింద్రాబాద్​కు పాలు, కూరగాయలు తీసుకెళ్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు దుస్థితి కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

పలువురు యాక్సిడెంట్​లలో చనిపోయారు. మండల పరిషత్​ జనరల్ బాడీ మీటింగ్​లో ఆయా గ్రామాల సర్పంచ్​లు ఎన్నో సార్లు రోడ్డు దుస్థితిని ప్రస్తావించారు. రోడ్డు బాగు చేయించాలని మండల ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే మదన్​ రెడ్డికి, మంత్రి హరీశ్​ రావుకు మొరపెట్టుకున్నారు. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి మిగతా ప్రాంతాల్లోనూ ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రోడ్లకు రిపేర్లు చేయించాలని పలువురు కోరుతున్నారు. 

ఎమ్మెల్యేను నిలదీసిన యవకులు 

ఇటీవల మండల కేంద్రమైన కొల్చారంలో రోడ్డు దుస్థితిపై నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని యువకులు నిలదీశారు. బస్టాండ్ నుంచి  ఊరి వరకు డబుల్ రోడ్డు వేసి డివైడర్​, బటర్​ ఫ్లై లైట్లు ఏర్పాటు చేయిస్తాని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఏండ్ల నుంచి ఇబ్బందులు పడుతున్నా రోడ్డు వేయడం లేదంటూ శివ్వంపేట మండలం హరిదాస్​ తండా గిరిజనులు ఇటీవల బురద రోడ్డు మీద వరి నాట్లు వేసి నిరసన తెలిపారు.