
- పోలీసుల లాఠీచార్జ్.. నేతలు, కార్యకర్తల అరెస్ట్
- 5న రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్ల బంద్‌కు పిలుపు
హైదరాబాద్, వెలుగు: సర్కార్ బడుల్లో సమస్యలు పరిష్కరించాలని, ప్రైవేట్ బడుల్లో ఫీజులను కంట్రోల్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రంలో సర్కార్ బడులు నాశనం అయ్యేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ శనివారం ఏబీవీపీ నేతలు, కార్యకర్తలు ర్యాలీగా సిటీలోని సైఫాబాద్లోనిస్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌కు వచ్చారు. పోలీసులు ముందుగానే మెయిన్ గేట్ల వరకూ పోకుండా అడ్డంగా బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. ఏబీవీపీ కార్యకర్తలు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. కొందరు కార్యకర్తలు బారికేడ్లను తోసేసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. మెయిన్ ఆఫీసు గేట్‌ను ఎక్కడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, సీడబ్ల్యూసీ మెంబర్ శ్రీహరి మాట్లాడుతూ.. శాంతియుతంగా ధర్నా చేస్తున్న కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం సరికాదన్నారు. సర్కారు తీరుకు నిరసనగా ఈ నెల 5న స్కూళ్ల బంద్‌కు పిలుపునిస్తున్నట్టు చెప్పారు. బడులు ప్రారంభమై నెలరోజులు కావొస్తున్నా, ఇప్పటికీ స్టూడెంట్లకు పుస్తకాలు, యూనిఫామ్ అందలేదన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీలు కమల్ సురేష్, అరవింద్, స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.