టీఎస్​పీఎస్సీ పేపర్ల లీక్​పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరగాలి

టీఎస్​పీఎస్సీ పేపర్ల లీక్​పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరగాలి

హైదరాబాద్, వెలుగు: టీఎస్​పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని, టీఎస్​పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, సెక్రటరీ అనితా రాంచంద్రన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. బుధవారం ఏబీవీపీ కార్యకర్తలు ఈ మేరకు నాంపల్లిలోని టీఎస్​పీఎస్సీ ఆఫీసును ముట్టడించారు. విద్యార్థి నాయకులు, కార్యకర్తలు కమిషన్ ఆఫీసులోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. పోలీసులకు, ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర నేతలు ఝాన్సీ, కమల్ సురేశ్, ప్రవీణ్ రెడ్డి, శ్రీకాంత్ మాట్లాడుతూ.. క్వశ్చన్ పేపర్ల లీకేజీలో తెరవెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలను, అధికారులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకూ ఎన్ని పేపర్లు లీక్ చేశారో వాటన్నింటినీ రద్దు చేసి, మళ్లీ పరీక్షలు నిర్వహించాలన్నారు. టీఎస్​పీఎస్సీని ప్రక్షాళన చేయాలని, పేపర్లు లీక్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు శ్రీనాథ్, పృథ్వి, జీవన్, మహేశ్, శ్రీరామ్, సిరివెన్నెల, కల్యాణ్, దీప్తి కల్యాణి, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.  

సీబీసీఐడీతో విచారణ చేయించాలె: ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ

టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీలపై సిట్​తో కాకుండా సీబీసీఐడీతో సమగ్ర విచారణ చేయించాలని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ సంఘాలు డిమాండ్ చేశాయి. బుధవారం ఆయా సంఘాల నేతలు, కార్యకర్తలు కూడా టీఎస్​పీఎస్సీ ఆఫీసును ముట్టడించి, నిరసన తెలిపారు. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్ మాట్లాడుతూ.. కాన్ఫిడెన్షియల్ విభాగంలోకి ఇతర సెక్షన్లలో డ్యూటీ చేసే వ్యక్తులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎలా ప్రవేశించారో చెప్పాలని డిమాండ్ చేశారు. నెట్ వర్క్ మేనేజర్ రాజశేఖర్ బీజేపీ కార్యకర్త అని, రాజకీయ కోణంలోనూ దీన్ని విచారించాలన్నారు. ధర్నాలో ఎస్ఎఫ్ఐ నేతలు కె.అశోక్ రెడ్డి, సంతోష్ రాథోడ్, లెనిన్ గువేరా, తదితరులు పాల్గొన్నారు.