బీఆర్​ఎస్​ సర్కార్​ను గద్దె దింపుతాం : ఏబీవీపీ నాయకులు

బీఆర్​ఎస్​ సర్కార్​ను గద్దె దింపుతాం : ఏబీవీపీ నాయకులు

మెదక్​ టౌన్/నర్సాపూర్, వెలుగు :  విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నా బీఆర్​ఎస్​ సర్కారును వచ్చే ఎన్నికల్లో గద్దె దింపుతామని ఏబీవీపీ నాయకులు అన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ ఆధ్వర్యంలో శుక్రవారం మెదక్, నర్సాపూర్ పట్టణాల్లో మానవహారం, ర్యాలీ, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.  ఈ సందర్భంగా మెదక్​లో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ, నర్సాపూర్​లో ఏబీవీపీ నగర కార్యదర్శి అక్షయ్ గౌడ్ మాట్లాడారు.

 రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ విద్యార్థుల జీవితాన్ని గాలికి వదిలేసి,  నిరుద్యోగుల జీవితాన్ని రోడ్డుపాలు చేసి రాజకీయ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడ్డ  మొదటి సంవత్సరంలో 11 శాతం నిధులు ఇచ్చి,  ప్రస్తుతం  కేవలం ఆరు శాతం నిధులు కేటాయించి ప్రభుత్వం స్టూడెంట్స్​కు తీరని అన్యాయం చేస్తోందని ఆరోపించారు. రూ.5300 కోట్ల పెండింగ్ స్కాలర్​షిప్​ తక్షణమే విడుదల చేయాలని, విద్యారంగం సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.