విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలె : కదనభేరి సభలో ఏబీవీపీ డిమాండ్

విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలె : కదనభేరి సభలో ఏబీవీపీ డిమాండ్

నాడు ఆంధ్రప్రదేశ్ నాయకుల పాలన అంతం కావాలని ఉస్మానియా యూనివర్శిటీలో రణభేరి మోగించామని, ఈనాడు కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ పరిపాలన అంతం కావాలని కదనభేరి మోగిస్తున్నామన్నారు ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ. గత తొమ్మిదేళ్లలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు రోడ్డున పడ్డాయన్నారు. కేసీఆర్ పరిపాలనలో 8 వేల పాఠశాలలు మూతపడ్డాయని చెప్పారు. TSPSC పేపర్స్ లీకేజీ సర్వ సాధారణమంటూ రాష్ట్ర మంత్రులు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఒక లక్షా 91 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. విద్యార్థులు, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించకుంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు ఏబీవీపీ నిద్రపోదని హెచ్చరించారు. మరోవైపు.. విద్యార్థి కదన భేరి సభ నుండి విద్యార్థుల సమస్యలపై కేసీఆర్ కు ఝాన్సీ బహిరంగ లేఖ విడుదల చేశారు. 

తెలంగాణలో ల్యాండ్, లిక్కర్, పేపర్ల లీకేజీ మాఫియా

తెలంగాణలో ల్యాండ్, లిక్కర్, పేపర్ల లీకేజీ మాఫియా నడుస్తోందని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి ఆకింత పవార్ ఆరోపించారు. నిరుద్యోగులు, విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో కనీసం బాత్రూమ్ లు కూడా లేవన్నారు. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో విద్యార్థులే కేసీఆర్ కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. భారతదేశం విశ్వగురువుగా మారుతోందన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఇండియా వైపు చూస్తున్నాయని తెలిపారు. 

కేసీఆర్ పరిపాలనలో 8 వేల స్కూల్స్ మూతపడ్డాయి

కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో దాదాపు ఎనిమిది వేల స్కూల్స్ మూతపడ్డాయని ఏబీవీపీ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఆశిష్ చౌహాన్ ఆరోపించారు. ఇప్పటికీ 20 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. గత తొమ్మిదేళ్ల నుంచి బడ్జెట్ లో విద్యా రంగానికి అతి తక్కువ నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. తెలంగాణకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన కేసీఆర్.. విద్యా రంగానికి ఏం చేశారని ప్రశ్నించారు. ప్రగతిభవన్ లో కూర్చుని.. కుటుంబ ప్రగతిని కేసీఆర్ పెంచారన్నారు. అధికారం ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని పక్కన పెట్టి.. పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజల సంపదను దోచుకున్న కేసీఆర్.. దేశ సంపదపై కన్నేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పతనం ఏబీవీపీ కదనభేరి సభతో మొదలైందన్నారు. 

అమరవీరుల ఆశయాలకు విరుద్ధంగా కేసీఆర్ పాలన

కల్వకుంట్ల ఫ్యామిలీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గత తొమ్మిదేళ్ల నుంచి చేసిందేమీ లేదన్నారు ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శుక్ల. ప్రత్యేక రాష్ట్రం వస్తే కార్పొరేట్ కాలేజీలను తెలంగాణ పొలిమేర నుంచి తరిమి వేస్తామన్న కేసీఆర్.. ఇప్పుడు వాటికి అండగా ఉంటున్నారని ఆరోపించారు. పేపర్ లీకేజీలతో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేశారని చెప్పారు. తెలంగాణ అమరవీరుల ఆశయాలకు విరుద్ధంగా కేసీఆర్ పాలన కొనసాగుతోందన్నారు. 

* విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను నెలరోజుల్లో రాష్ర్ట ప్రభుత్వం పరిష్కరించాలని ఆల్ ఇండియా జాయింట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఒకవేళ సమస్యలను పరిష్కరించకపోతే ప్రగతిభవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.