ఆసిఫాబాద్, వెలుగు: రైస్ మిల్లర్ నుంచి లంచం తీసుకుంటూ కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సివిల్ సప్లై డీఎం నర్సింహారావు ఏసీబీకి పట్టుబడ్డాడు. ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం.. దహెగాంకు చెందిన వాసవీమాత రైస్ మిల్లుకు సీఎంఆర్ వడ్లు కేటాయించారు. ఈ వడ్లను మర ఆడించి గోదామ్‌కు పంపించే విషయంలో ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా సర్టిఫై చేసేందుకు సివిల్ సప్లై డీఎం నర్సింహారావు లంచం అడిగాడు.
మూడు లారీల బియ్యం పాస్ చేసేందుకు, ఒక్కో లారీకి రూ.25 వేల చొప్పున రూ.75 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు డీఎం నర్సింహారావు తన ఆఫీస్ లో పని చేసే ఔట్ సోర్సింగ్ టెక్నికల్ అసిస్టెంట్ మణికంఠకు మంచిర్యాల హైవేపై గురువారం సాయంత్రం డబ్బులు ఇవ్వగా, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం వారిని కలెక్టరేట్ లోని ఆఫీస్ కు తరలించి విచారించారు.
రూ.10 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన ఏఈవో
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా మరిపెడలో గురువారం ఓ రైతు కొడుకు వద్ద రూ.10 వేలు లంచం తీసుకుంటూ నీలికుర్తి క్లస్టర్ ఏఈవో జి.సందీప్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మరిపెడ మండలం అనేపురం గ్రామానికి చెందిన రైతు గుగులోతు భిక్కు(50) ఇటీవల చనిపోయాడు.
అతడి కొడుకు వసంత్ ప్రభుత్వం నుంచి వచ్చే రైతు భరోసా డబ్బుల కోసం ఏఈవో జి సందీప్ ను సంప్రదించగా, డాక్యుమెంట్లు అప్లోడ్ చేసేందుకు రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మరిపెడ బస్టాండ్ సమీపంలోని ఓ బేకరి వద్ద రూ.10 వేలు ఇవ్వగా, ఏఈవో సందీప్ ను పట్టుకున్నారు. అతడిని ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్లు డీఎస్పీ తెలిపారు.
