- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సివిల్ సప్లై ఆఫీసర్లు
- రూ. 30 వేలతో దొరికిన ఇల్లెందు డీటీ, ఈపాస్ టెక్నికల్ అసిస్టెంట్
ఇల్లెందు, వెలుగు : రేషన్ డీలర్ నుంచి రూ.30 వేలు తీసుకుంటూ ఇల్లెందు సివిల్ సప్లై డీటీ మహ్మద్ యాకూబ్‌పాషా, ఈపోస్ టెక్నికల్ అసిస్టెంట్ విజయ్, రేషన్ డీలర్స్ అసోసియేషన్ ఇల్లెందు అధ్యక్షుడు శబరీశ్ సోమవారం ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ వై. రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని ఓ రేషన్ షాపును ఇటీవల సివిల్ సప్లై డీటీ మహ్మద్ యాకూబ్ పాషా తనిఖీ చేయగా.. స్టాక్ తక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రూ. 30 వేలు ఇవ్వాలని డీటీ.. రేషన్ డీలర్‌ను డిమాండ్ చేశారు.
ఈ డబ్బులను రేషన్ డీలర్స్ అసోసియేషన్ ఇల్లెందు అధ్యక్షుడు శబరీశ్‌కు ఇవ్వాలని సూచించాడు. అయితే తాను అంత డబ్బు ఇచ్చుకోలేనని సదరు డీలర్ చెప్పినా వినకుండా డబ్బులు ఇవ్వాల్సిందేనని డీటీ పట్టుబట్టాడు. దీంతో డీలర్ ఏసీబీ ఆఫీసర్లను కలిసి ఫిర్యాదు చేశాడు. వారి సూచన మేరకు సోమవారం ఉదయం రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శబరీశ్‌ను కలిసి డబ్బులు ఇచ్చాడు.
అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు శబరీశ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకొని ఇల్లెందు తహసీల్దార్ ఆఫీస్‌కు తీసుకెళ్లి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. అయితే సివిల్ సప్లై డీటీ యాకూబ్ పాషా, టెక్నీషియన్ విజయ్ ఒత్తిడి మేరకే తాను డబ్బులు తీసుకున్నట్లు శబరీశ్ చెప్పడంతో ముగ్గురునీ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
