
- 25 బుల్లెట్లు, 61 వాడినబుల్లెట్ క్యాప్స్ స్వాధీనం
- విలువైన డాక్యుమెంట్స్ లభ్యం!
- హయత్ నగర్ పీఎస్ లో మరో కేసు నమోదు
ఎల్బీనగర్, వెలుగు: స్కానింగ్ సెంటర్ నిర్వహకుడిని అరెస్ట్ నుంచి తప్పించేందుకు రూ.16 లక్షలు డిమాండ్ చేసిన కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన డీఎస్పీ పార్థ సారథి ఇంట్లో మంగళవారం సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో డీఎస్పీ ఇంటిలో బుల్లెట్లు దొరకడం కలకలం రేపింది. హైదరాబాద్ నగరం హయత్ నగర్ సమీపంలోని దత్తాత్రేయ నగర్ కాలనీలోని ఆయన ఇంటితో పాటు మరికొన్ని చోట్ల తనిఖీలు చేపట్టారు.
పార్థసారథి ఇంట్లో ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, నగదు, బంగారం ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. తనిఖీ సమయంలో ఏసీబీ అధికారులు షాక్ కు గురయ్యారు. సాధారణంగా ఆ స్థాయి అధికారి వద్ద డిపార్ట్మెంట్ రివాల్వర్ ఉంటుంది. దానికి సంబంధించిన ఓ మ్యాగ్జిన్ ఉంటుంది. కానీ, డీఎస్పీ ఇంటిలో అక్రమంగా ఉన్న 25 లైవ్ బుల్లెట్స్, 61 యూజ్ చేసిన బుల్లెట్ క్యాప్స్ ను ఏసీబీ అధికారులు గుర్తించారు.
అక్రమంగా బుల్లెట్స్ ఉండడంతో ఏసీబీ అధికారి మురళి హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీఎస్పీ పార్థసారథిపై హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పార్థసారథి ఇంట్లో దొరికిన బుల్లెట్లు ఎక్కడివి? ఆయన ఇంట్లో ఎందుకు ఉన్నాయి? యూజ్ చేసిన బుల్లెట్స్ ఎక్కడ వాడినవి? వాటిని ఎక్కడ ఉపయోగించారు? అనే కోణంలో పోలీసులు, ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.