తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసీబీ మెరుపు దాడులు.. భారీగా లెక్కల్లో చూపని నగదు సీజ్

 తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసీబీ మెరుపు దాడులు.. భారీగా లెక్కల్లో చూపని  నగదు సీజ్

 తెలంగాణలో ఏసీబీ దూకుడు పెంచింది. లంచాలకు మరిగిన ప్రభుత్వ అధికారుల భరతం పడుతోంది. నిన్నటి వరకు మున్సిపల్, రెవెన్యూ, పోలీసు శాఖలపై సోదాలు చేసిన ఏసీబీ ఇపుడు రోడ్డు రవాణా శాఖలో సోదాలు చేస్తోంది.    ఆర్టీఏ అధికారులు అంతరాష్ట్ర చెక్ పోస్టుల దగ్గర  విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలో అర్థరాత్రి తెలంగాణలోని పలు జిల్లాల్లో సోదాలు చేశారు ఏసీబీ అధికారులు. వారి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు.

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం పోందుర్తి ఆర్టీఏ చెక్ పాయింట్ దగ్గర అక్టోబర్ 19న అర్థరాత్రి  ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. వాహనాల నుంచి ప్రైవేటు వ్యక్తులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ. 51,300 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. 

సంగారెడ్డి జిల్లా  చిరాగ్ పల్లి మండలం మాడ్గిలోని అంతరాష్ట్ర ఆర్టీఏ చెక్ పోస్టుపై అర్ధరాత్రి ఏసీబీ అధికారుల దాడి చేశారు.వాహనాల డ్రైవర్ల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారన్న సమాచారంతో ఏసీబీ దాడి చేసింది  మెదక్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు  చేపట్టారు.  తనిఖీల్లో లెక్కల్లో చూపని రూ. 43, 300 నగదు స్వాధీనం చేసుకున్నారు. 

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగూడెం దగ్గర రాష్ట్ర సరిహద్దు  రవాణా శాఖ చెక్ ఫోస్ట్ పై ఏసిబి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అర్దరాత్రి నుండి సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. అంతరాష్ట్ర వాహనాల నుంచి అక్రమంగా డబ్బులు వసూళ్ళు చేస్తూన్నరనే ఆరోపణలతో దాడులు నిర్వహించారు. చెక్ పోస్ట్  దగ్గర లారీలను ఆపి డ్రైవర్లు చెక్ పోస్టులో  డబ్బులు ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 

ఉమ్మడి ఆదిలాబాద్   జిల్లాలో  అంతరాష్ట్ర  చెక్ పోస్టుల పై  ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.  బైంసా చెక్ పోస్టులో  రూ. 3000 వేల నగదు పట్టుకున్నారు.  ఆదిలాబాద్ జిల్లా బోరజ్ చెక్ పోస్టులో లక్షా 26 వేలు పట్టుకున్నారు అధికారులు.  కుమ్రంబీమ్ జిల్లా వాంకిడి చెక్ పోస్ట్ లో‌  రూ. 5100 లు పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.  కేసు నమోదు చేసి విచారణ  జరుపుతున్నారు ఏసీబీ అధికారులు.