మంచిర్యాల జిల్లాలో ఏసీబీ దాడులు.. పది వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ తహసీల్దార్..

మంచిర్యాల జిల్లాలో ఏసీబీ దాడులు.. పది వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ తహసీల్దార్..

మంచిర్యాల జిల్లాలో ఆకస్మిక దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు. శుక్రవారం ( జులై 4 ) కోటిపల్లి తహసీల్దార్ కార్యాలయంలో దాడులు నిర్వహించిన అధికారులు డిప్యూటీ తహసీల్దార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డిప్యూటీ తహసీల్దార్ నవీన్ ఓ రైతు దగ్గర నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు అధికారులు. నవీన్ అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా తమ దృష్టికి తేవాలని.. అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చినా కూడా నేరమేనని.. లంచం ఇచ్చి అవినీతిని ప్రోత్సహించొద్దని సూచిస్తున్నారు అధికారులు.

ఇటీవల దూకుడు పెంచారు ఏసీబీ అధికారులు.. జూన్ 26న తెలంగాణ వ్యాప్తంగా 33 ఆర్టీవో(రీజనల్ ట్రాన్స్‌‌‌‌పోర్ట్ ఆఫీస్) కార్యాలయాలు, సరిహద్దుల్లోని ఆర్‌‌‌‌టీఏ(రీజనల్ ట్రాన్స్‌‌‌‌పోర్ట్ అథారిటీ)చెక్‌‌‌‌పోస్టులపై ఏసీబీ(యాంటీ కరప్షన్ బ్యూరో) అధికారులు  ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఉప్పల్, తిరుమలగిరి, కామారెడ్డి, పెద్దపల్లి, నిజామాబాద్ పాటు మరో 19 ఆర్‌‌‌‌టీఏ ఆఫీసులు, చెక్‌‌‌‌పోస్టులపై అధికారులు దాడులు చేసి సుమారు రూ.1,81,030 నగదును స్వాధీనం చేసుకున్నారు. గతేడాది జూన్ లో కూడా ఏసీబీ అధికారులు  రాష్ట్రవ్యాప్తంగా పలు ఆర్‌‌‌‌టీఏ కార్యాలయాలపై  దాడులు చేశారు. ఈ ఏడాది మరోసారి ఆర్‌‌‌‌టీఏ కార్యాలయాలపై దాడులు చేపట్టారు.

హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ శ్రీధర్, రంగారెడ్డి జిల్లా డిఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఈ సందర్భంగా తిరుమలగిరిలో 10 మంది ఏజెంట్‌‌‌‌లను, ఉప్పల్‌‌‌‌లో మరో 10 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచిసెల్ ఫోన్లు, ఇతరత్రా సమాచారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28 మంది ఏజెంట్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని వారిని ప్రశ్నించినట్టుగా తెలిసింది.ఆర్‌‌‌‌టీఏ కార్యాలయాల్లో వాహనాల లైసెన్సుల జారీతోపాటు తదితర విషయాల్లో అధికారులు, రవాణా ఉద్యోగులు కమీషన్లు తీసుకుంటూ అక్రమ దందాలకు పాల్పడుతున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించినట్టు సమాచారం.