
రంగారెడ్డి జిల్లా కేశంపేట్ మాజీ ఎమ్మార్వో వి.లావణ్య ఆమె భర్త నునావత్ వెంకటేశ్వర నాయక్ ల బినామీ ఇండ్లలో డీఎస్పీ రమణ కుమార్ ఆధ్వర్యంలోని ఏసీబీ టీమ్ మంగళవారం సోదాలు నిర్వహించింది. హైదరాబాద్లోని హయత్నగర్, సూర్యాపేట జిల్లా కపూరియా తండాలో సోదాలు చేసి.. రూ.1,33,35,012 విలువ చేసే ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఓ రైతు నుంచి రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కొందుర్గు వీఆర్‌వో అనంతయ్యతో పాటు కేశంపేట్ ఎమ్మార్వో లావణ్యపై ఏసీబీ కేసు నమోదు చేసి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే లావణ్య ఇంట్లో రూ.93 లక్షల నగదు, 400 గ్రాముల బంగారం ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజినల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న లావణ్య భర్త వెంకటేశ్వర నాయక్.. ఆగస్ట్ 31న ఓ వ్యక్తి నుంచి రూ.2.5 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. భార్యాభర్తలపై నమోదైన అవినీతి కేసులతో పాటు ఈ నెల 19 న ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు ఏసీబీ కేసు రిజిస్టర్ చేసింది. అందులో భాగంగా మంగళవారం నిందితుల బినామీల ఇండ్లలో సోదాలు జరిపింది.