- 700 కోట్ల పెట్టుబడులు వచ్చాయనడంలో వాస్తవం లేదు
- తేల్చిచెప్పిన ఏసీబీ నివేదిక
- పైగా హెచ్‌ఎండీఏకు రూ. 54.88 కోట్ల నష్టం
- కార్ రేసింగ్ నిర్వహణ కేటీఆర్ సొంత నిర్ణయమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఫార్ములా ఈ రేసుతో రాష్ట్రానికి రూ.700 కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ కేటీఆర్ చెప్పిన మాటల్లో వాస్తవం లేదని ఏసీబీ నివేదిక స్పష్టం చేసింది. ‘‘ నీల్సన్ రిపోర్టు ఆధారంగా ఈ రేస్ ద్వారా రాష్ట్రానికి రూ.700 కోట్ల పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ చెప్పారు. కానీ, అందులో నిజం లేదు. సమాచారం కోసం నీల్సన్ ను సంప్రదిస్తే స్పందించేందుకు నిరాకరించింది’’ అని ఏసీబీ తన రిపోర్ట్‌లో పేర్కొంది.
ఫార్ములా ఈ రేస్ నిర్వహణ అప్పటి మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ సొంత నిర్ణయమని వెల్లడించింది. కేటీఆర్ ఆదేశాలను గుడ్డిగా నమ్మి హెచ్‌ఎండీఏ ఏకంగా రూ. 54.88 కోట్లు నష్టపోయిందని, ప్రతిగా ఎన్నికల ఫండ్ రూపంలో బీఆర్‌ఎస్‌కు రూ.44 కోట్లు లబ్ధి చేకూరిందని ఏసీబీ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సెప్టెంబర్‌లోనే నివేదిక అందించింది. ఇందులోని పూర్తి వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
ప్రైవేట్ వ్యక్తుల ప్రతిపాదనలతో ఫార్ములా ఈ రేస్
“ఫార్ములా ఈ కారు ఆలోచన ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కన్సల్టెంట్ గువ్వడ కిరణ్ మల్లేశ్వరరావు, ఓ రేసింగ్ టీమ్ సీఈవో దిల్‌బాగ్ గిల్‌ది. గతంలో వీరిద్దరూ కలిసి హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్ నిర్వహించాలనుకున్నారు. ఇందుకుగాను అప్పటి ఈవీ డైరెక్టర్ సూరజ్‌ను కలిశారు. ఈ క్రమంలోనే 2021 డిసెంబర్ 18న ఎలక్ట్రిక్ వెహికల్స్ పై టీహబ్‌లో ఇచ్చిన ప్రజంటేషన్‌లో పాల్గొన్నారు.
ఈ రేసు సీజన్స్ నిర్వహించేందుకు గ్రీన్‌కో గ్రూప్ వ్యవస్థాపకుడు చలమశెట్టి అనీల్‌ను సంప్రదించారు. ఆ తర్వాత నాటి మంత్రి కేటీఆర్‌తోపాటు పలువురు ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. 2022 జనవరి 17న ఫార్ములా- ఈ ఆపరేషన్స్ తరఫున అల్బెర్టో లాంగో, అప్పటి ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ అరవింద్‌కుమార్, గ్రీన్ కో గ్రూప్ అనీల్ లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై సంతకాలు చేశారు.
రేసు నిర్వహణ కోసం ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారం అంతా అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అరవింద్‌కుమార్ సంతకాలు చేశారు. ఇవన్నీ ప్రభుత్వ రికార్డులోకి ఎక్కలేదు” అని ఏసీబీ తన రిపోర్టులో వెల్లడించింది.
విజయవంతంగా జరిగిందని చెప్తూ..!
2023 ఫిబ్రవరిలో సీజన్ 9 నిర్వహణ ద్వారా ఏస్ నెక్స్ట్ జెన్‌కు రూ. 175 కోట్లు నష్టం వచ్చింది. దాంతో సీజన్-10 స్పాన్సర్ షిప్‌ను ఉపసంహరించుకుంది.సీజన్-10 బాధ్యతతో పాటు ప్రమోటర్‌గా ప్రభుత్వం ఉండేలా అరవింద్‌కుమార్ హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డితో కలిసి నోట్‌ఫైల్ సిద్ధం చేశారు.
ఫీజుల కోసం రూ.110 కోట్లు, పనులకు గాను అదనంగా మరో రూ.50 కోట్లు మొత్తం రూ.160 కోట్లు విడుదలకు అరవింద్‌కుమార్ అనుమతులిచ్చారు. సీజన్ 9 విజయవంతమని పేర్కొంటూ..హెచ్‌ఎండీఏ నుంచి 54.88 కోట్లు ఖర్చుచేశారని నివేదికలో స్పష్టం చేసింది.
