మేడ్చల్, రంగారెడ్డి డిప్యూటీ కలెక్టర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు.. వందల కోట్ల అక్రమాస్తులు.!

మేడ్చల్, రంగారెడ్డి డిప్యూటీ కలెక్టర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు.. వందల కోట్ల అక్రమాస్తులు.!

తెలంగాణ రెవెన్యూ శాఖలో మరో భారీ అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ఇళ్లతో పాటు, ఆయనకు సంబంధించిన ఏకంగా 8 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు మే 22న ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ సోదాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.

గతంలో శేరిలింగంపల్లితో పాటు పలు కీలక ప్రాంతాల్లో ఆర్‌డీవోగా పనిచేసిన వంశీ మోహన్.. ఆ పదవులను అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులను కొట్టేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా అబ్దుల్లాపూర్ మెట్, పిగ్లీపురం పరిధిలో ఏకంగా 8 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని ఈయన కాజేసినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది.

అంతేకాదు ఆ ప్రభుత్వ భూమిని గుట్టుచప్పుడు కాకుండా తన మామ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి, ఆ తర్వాత ఒక ప్రముఖ రియల్టర్‌కు దారాదత్తం చేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఆ డీల్‌కు ప్రతిఫలంగా రియల్టర్ నుంచి వంశీ మోహన్ ఏకంగా 10 ప్లాట్లను గిఫ్ట్ డీడ్ రూపంలో లంచంగా తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు.

ప్రస్తుతం జరుగుతున్న సోదాల్లో వంశీ మోహన్‌కు సంబంధించి వందల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూములను రియల్టర్లకు అప్పగిస్తూ..వందల కోట్లు వెనకేసిన ఈ డిప్యూటీ కలెక్టర్ భాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది.