
- దర్యాప్తులో సేకరించిన ఆధారాలతో రిపోర్ట్ రెడీ
- కీలకంగా మారిన ఈ రేస్ అగ్రిమెంట్లు, హెచ్‌ఎండీఏ బోర్డ్ ద్వారా చెల్లింపులు
- ప్రాసిక్యూషన్ విచారణకు సర్కారు అనుమతి కోరనున్న ఆఫీసర్లు
- పర్మిషన్ రాగానే కోర్టులో చార్జిషీట్ దాఖలు!
హైదరాబాద్, వెలుగు: ఫార్ములా ఈ కారు రేస్ కేసు తుది దశకు చేరింది. దర్యాప్తులో భాగంగా సేకరించిన ఆధారాలు, సాక్షులు, నిందితుల స్టేట్‌మెంట్లు, హెచ్‌ఎండీఏ బోర్డు నిధుల నుంచి విదేశీ కంపెనీకి చెల్లించిన డబ్బుకు సంబంధించిన పూర్తి వివరాలతో ఏసీబీ నివేదికను సిద్ధం చేస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్(ఎంఏయూడీ), హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈవెంట్లు, ఈ కార్ రేస్ అగ్రిమెంట్లు, నిందితులైన మున్సిపల్ శాఖ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంఏయూడీ మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి స్టేట్‌మెంట్లతో కూడిన సమగ్ర రిపోర్ట్‌ను ప్రభుత్వానికి అందించనున్నది.
ఇక ప్రాసిక్యూషన్ విచారణ
ప్రధానంగా హెచ్‌ఎండీఏ బోర్డు నిధుల దుర్వినియోగం సహా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండగానే జరిగిన అగ్రిమెంట్లు, చెల్లింపులకు సంబంధించిన పూర్తి ఆధారాలను ఏసీబీ సేకరించింది. ఫార్ములా ఈ ఆపరేషన్స్‌కు చేరిన రూ.45.71 కోట్లు, ఇన్‌కమ్ ట్యాక్స్ పెనాలిటీలు సహా మొత్తం రూ. 54.89 కోట్ల దుర్వినియోగానికి సంబంధించిన కీలక ఆధారాలతో నివేదిక సిద్ధం చేసింది.
సాక్షులు, నిందితుల స్టేట్‌మెంట్లను ఇప్పటికే కోర్టుకు సమర్పించింది. ఈ క్రమంలోనే కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడం ద్వారా ప్రాసిక్యూషన్ విచారణ జరిపేందుకు అవసరమైన చర్యలు చేపడ్తున్నారు.
కేటీఆర్ సహానిందితులందరినీ విచారించిన ఏసీబీ
2023 ఫిబ్రవరిలో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్ సీజన్ 9, 2024 ఫిబ్రవరి 10న నిర్వహించ తలపెట్టిన సీజన్10లో భారీ అక్రమాలు జరిగినట్లు తేలింది. హెచ్‌ఎండీఏ బోర్డుకు చెందిన రూ.54.89 కోట్లు దుర్వినియోగం అయ్యాయన్న ఎంఏయూడీ ఫిర్యాదుతో నిరుడు డిసెంబర్ 19న ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా కేటీఆర్, రెండో నిందితుడిగా సీనియర్ ఐఏఎస్ అర్వింద్‌కుమార్, మూడో నిందితుడిగా హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిని చేర్చింది.
దర్యాప్తులో భాగంగా ఈ ఏడాది జనవరి 8న ఐఏఎస్ అర్వింద్‌కుమార్,9న కేటీఆర్,10న బీఎల్‌ఎన్‌రెడ్డిని ఏసీబీ విచారించింది. అదే నెల18న గ్రీన్‌కో ఏస్ నెక్స్ట్‌జెన్ ఎండీ చలమలశెట్టి అనిల్‌కుమార్ ను ప్రశ్నించింది. వీరిచ్చిన సమాచారంతో ఏసీబీ అధికారులు స్టేట్‌మెంట్లు రికార్డ్ చేశారు. ఈ కేసులో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను వారి స్టేట్‌మెంట్స్ ఆధారంగా మార్క్ చేశారు. బ్రిటన్‌కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ ప్రతినిధులను వర్చువల్‌గా ప్రశ్నించారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ కూడా ఈ ముగ్గురిని విచారించింది.