ఏసీబీకి చిక్కిన ఎల్లంపేట టీపీవో ..వెంచర్ గేట్లు కూల్చకుండా ఉండేందుకు రూ.5 లక్షలు డిమాండ్

ఏసీబీకి చిక్కిన ఎల్లంపేట టీపీవో ..వెంచర్ గేట్లు కూల్చకుండా ఉండేందుకు రూ.5 లక్షలు డిమాండ్

మేడ్చల్, వెలుగు: వెంచర్​ నిర్వాహకుల వద్ద లంచం తీసుకుంటూ ఎల్లంపేట్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్​ రాధాకృష్ణ రెడ్డి ఏసీబీకి చిక్కారు. హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపిన ప్రకారం.. ఎల్లంపేట మున్సిపల్​ పరిధిలోని హెచ్ఎండీఏ అనుమతి ఉన్న గంగస్థాన్ వెంచర్ నిర్వాహకులు తమ పరిధి మేరకు ప్రహరీ నిర్మించి గేట్లు ఏర్పాటు చేశారు. గేట్లు అక్రమంగా ఏర్పాటు చేశారని, వాటిని కూల్చేస్తామని టీపీవో బెదిరించాడు. 

రూ.5 లక్షలు ఇస్తే చూసీచూడనట్లు ఉంటామని చెప్పాడు. దీంతో వెంచర్​ నిర్వాహకులు రూ.4 లక్షల 50  వేలు ఇస్తామని ఒప్పుకున్నారు. వారం క్రితం రూ.లక్ష ఇచ్చారు. మరో రూ.3 లక్షల 50 వేలు శనివారం టీపీవో రాధాకృష్ణారెడ్డికి కొంపల్లిలోని తన ఇంటి వద్ద ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందులో మున్సిపల్ కమిషనర్ ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.