గద్వాల/శాంతినగర్, వెలుగు: భూమిని సర్వే చేయడానికి రూ.10 వేలు లంచం తీసుకుంటూ జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల సర్వేయర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డేపల్లి మండలం కొంకల గ్రామానికి చెందిన ఓ రైతుకు చెందిన నాలుగు ఎకరాల భూమిని సర్వే చేయడానికి సర్వేయర్ బ్రహ్మయ్య ఎకరాకు రూ.5 వేల చొప్పున లంచం డిమాండ్ చేశాడు.
బాధితుడు ముందుగా రూ.5 వేలు ఇవ్వగా, మొత్తం డబ్బులు ఇస్తేనే సర్వే చేస్తానని సర్వేయర్ తేల్చి చెప్పడంతో బాధితుడు ఏసీబీ ఆఫీసర్లను సంప్రదించాడు. వారి సూచనల మేరకు మంగళవారం తహసీల్దార్ ఆఫీస్ లో సర్వేయర్ బ్రహ్మయ్యకు రూ.10 వేలు లంచం ఇవ్వగా, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
సర్వేయర్ ది గట్టు మండల కేంద్రం కావడంతో అక్కడ కూడా తనిఖీలు చేశారు. గద్వాల, రాయచూరు, అయిజలో ఇండ్లు, అయిజ మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలో 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు ఏసీబీ ఆఫీసర్లు గుర్తించారు. రాయచూరులో రూ.90 లక్షలతో పెద్ద కొడుకుకు మెడికల్ సీటు, రెండో కొడుకుకు అగ్రికల్చర్ సీటు ఇప్పించినట్లు గుర్తించినట్లు సమాచారం.
