
పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రామగుండం సింగరేణి ఏరియా జిడి గోదావరిఖని 11వ బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆపరేటర్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే రామగిరి మండలం పన్నుర్ కు చెందిన ఇజ్జగిరి ప్రతాప్ గోదావరిఖని 11వ బొగ్గు గనిలో ఎల్ హెచ్ డి అపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. నైట్ షిఫ్ట్ లో విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఎల్ హెచ్ డి వాహనం బోల్తా పడి కార్మికుడు మృతి చెందాడు.
యాక్సిడెంట్ ను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గోదావరిఖని సింగరేణి ఏరియా హస్పటల్ కు తరలించారు. యాక్సిడెంట్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. సర్వీస్ పూర్తయిన వాహనాలను నడిపిస్తూ యజమాన్యం కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని ఫైర్ అయ్యారు కార్మిక సంఘాల నాయకులు.
ప్రమాదానికి కారణమైన గని అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనల కార్యక్రమాలు చేపడతామని కార్మిక సంఘాల నాయకులు యాజమాన్యాన్ని హెచ్చరించారు. మృతి చెందిన కార్మికుని కుటుంబాన్ని సింగరేణి యాజమాన్యం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.