సూర్యాపేట జిల్లాలో కారు బోల్తా.. ఇద్దరు టీచర్లు మృతి.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు

సూర్యాపేట జిల్లాలో కారు బోల్తా.. ఇద్దరు టీచర్లు మృతి.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు

తుంగతుర్తి, వెలుగు: ప్రమాదవశాత్తు అదుపుతప్పి కారు బోల్తా పడి ఇద్దరు టీచర్లు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన అలుగు ప్రవీణ్ కుమార్ (తుంగతుర్తి జెడ్పీ స్కూల్ హెచ్ఎం), కల్పన(తుంగతుర్తి కస్తూర్భా స్కూల్ స్పెషల్ ఆఫీసర్), పోరెడ్డి గీతారెడ్డి( రావులపల్లి జెడ్పీ స్కూల్ హెచ్ఎం), అలుగు సునీత(అన్నారం జెడ్పీ స్కూల్ గెజిటెడ్ హెచ్ఎంఋ), సూర్యాపేట జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు.

సంక్రాంతి సెలవులు ముగిసిన అనంతరం డ్యూటీకి వెళ్లేందుకు శనివారం ఉదయం నలుగురు ఉపాధ్యాయులు ఒకే కారులో బయలుదేరారు. మార్గమధ్యలో అర్వపల్లి వద్ద హైవే –365పై కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో కల్పన(43)కు తీవ్రగాయాలై స్పాట్ లో చనిపోయింది. మరో ముగ్గురిని చికిత్స కోసం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

కండీషన్ సీరియస్ గా ఉండడంతో హైదరాబాద్ కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో గీతారెడ్డి(48) చనిపోయారు. మరో ఇద్దరు  హైదరాబాద్ లోని ప్రవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన ఇద్దరిలో సునీత, ప్రవీణ్ కుమార్ అక్కాతమ్ముళ్లు. ఈ ప్రమాదంతో అన్నారం, రావులపల్లి, కస్తూర్భా, తుంగతుర్తి స్కూళ్లలో విషాదం నెలకొంది. సూర్యాపేట ఎస్పీ నరసింహ ఘటనా స్థలానికి వెళ్లి ప్రమాద తీరుపై విచారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.