రాబోయే ఐదు రోజులు హై టెంపరేచర్లు: వాతావరణ శాఖ

రాబోయే ఐదు రోజులు హై టెంపరేచర్లు: వాతావరణ శాఖ
  • రాబోయే ఐదు రోజులు హై టెంపరేచర్లు: వాతావరణ శాఖ
  • రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం
  • ఉత్తర తెలంగాణ జిల్లాలకు వడగాడ్పుల వార్నింగ్​..

హైదరాబాద్​, వెలుగు:  రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. రాబోయే ఐదు రోజుల పాటు మరింత తీవ్రంగా ఉండనున్నాయి. వడగాడ్పుల ప్రభావం కూడా ఎక్కువ కానున్నది. ఈ మేరకు ఆదివారం వాతావరణ శాఖ 15 జిల్లాలకు ఎండలపై ఆరెంజ్​అలర్ట్​ జారీ చేసింది. రాత్రిపూట కూడా టెంపరేచర్లు పెరుగుతాయని హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాడ్పుల ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఆదిలాబాద్​, కుమ్రంభీం ఆసిఫాబాద్​, మంచిర్యాల, నిర్మల్​, నిజామాబాద్​, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్​, పెద్దపల్లి, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వడగాడ్పులు ఎక్కువగా వీచే ముప్పు ఉందని తెలిపింది. మరోవైపు ఆయా జిల్లాలతోపాటు మహబూబ్​నగర్​, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్​కర్నూల్​ జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో టెంపరేచర్లు 3 డిగ్రీల వరకు పెరిగే ప్రమాదమున్నదని తెలిపింది.

పెరుగుతున్న ఫారెస్ట్​ ఫైర్స్ 

ఎండల ప్రభావంతో రాష్ట్రంలోనూ కార్చిచ్చు ఘటనలు పెరుగుతున్నాయి. మూడు రోజుల నుంచి ఏజెన్సీ ఏరియాలతో పాటు నల్లమల అటవీ ప్రాంతంలో ఫారెస్ట్​ ఫైర్స్​ జరుగుతున్నట్టు నాసా ఫైర్​ ఇన్ఫర్మేషన్​ రిసోర్స్​ మేనేజ్ మెంట్​ సిస్టమ్​ మ్యాప్స్​ స్పష్టం చేస్తున్నది.  మూడు రోజులుగా 82 కార్చిచ్చు ఘటనలు జరగ్గా.. అందులో 5 పెద్ద ఘటనలున్నట్టు నాసా ఫైర్​ మ్యాప్స్​ వెల్లడించింది. దేశంలో కార్చిచ్చు ఘటనలు ఎక్కువగా జరిగిన రాష్ట్రాల్లో తెలంగాణ మూడో ప్లేస్​లో ఉన్నట్టు తేలింది. టెంపరేచర్లు ఇప్పటికే 43 డిగ్రీల మార్క్​ను దాటిన నేపథ్యంలో.. మున్ముందు టెంపరేచర్ల తీవ్రత మరింత పెరిగే ప్రమాదముంది. ఈ నేపథ్యంలోనే ఫారెస్ట్​ ఫైర్స్​ ఘటనలు కూడా పెరిగే ఆస్కారముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

పలు జిల్లాల్లో కొంచెం తగ్గిన టెంపరేచర్స్​

ఆదివారం పలు జిల్లాల్లో టెంపరేచర్లు కొద్దిగా తగ్గాయి. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో గత రెండు రోజులపాటు 43 డిగ్రీల టెంపరేచర్లు నమోదు కాగా.. ఆదివారం 42 డిగ్రీల వరకు రికార్డ్​ అయ్యాయి. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్​, నిర్మల్ లో 42.3, వనపర్తిలో 42.2, కుమ్రంభీం ఆసిఫాబాద్​లో 41.8, కామారెడ్డి, నాగర్​కర్నూల్ లో 41.7, మహబూబ్​నగర్​, రాజన్న సిరిసిల్లలో 41.4, భద్రాద్రి కొత్తగూడెం 41.3,  సూర్యాపేటలో 41.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో 39 నుంచి 41 డిగ్రీల మధ్య టెంపరేచర్లు రికార్డు అయ్యాయి.