సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం.. బేసిక్ పే ఇవ్వాల్సిందే

సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం.. బేసిక్ పే ఇవ్వాల్సిందే

డీఎస్ఈ ఆఫీస్ ముట్టడించిన కేజీబీవీ, యూఆర్ఎస్ ఉద్యోగులు
జోరు వానలోనూ ఐదు గంటల పాటు నిరసన
మద్దతు ప్రకటించిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, యూటీఎఫ్ నేతలు 
సీఎస్ శాంతికుమారిని కలిసి వినతిపత్రం అందజేత


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కేజీబీవీలు, యూఆర్ఎస్, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న టీచర్లు, ఉద్యోగులకు బేసిక్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘చలో ఎస్​పీడీ ఆఫీస్’ ప్రోగ్రామ్ ఉద్రిక్తంగా మారింది. జోరువానను కూడా లెక్కచేయకుండా ఉద్యోగులు ఐదు గంటల పాటు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ (డీఎస్ఈ)ను దిగ్భందం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులు ర్యాలీగా డైరెక్టరేట్​కు వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో మహిళా ఉద్యోగులు రావడంతో పోలీసులు చేతులెత్తేశారు. దీంతో ఆఫీస్ ప్రధాన గేటు ముందు వారంతా బైఠాయించారు. భారీ వర్షంలోనూ తమ డిమాండ్ల సాధన కోసం నినాదాలు చేశారు. గొడుగులు పట్టుకొని నిరసన కొనసాగించారు. టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఉద్యోగులకు మద్దతు ప్రకటించి మాట్లాడారు. ఉద్యోగులకు కనీస వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలన్నారు.


డిమాండ్లు న్యాయబద్ధమైనవే..
టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవి మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం మంత్రులు, అధికారులకు అనేక సార్లు వినతిపత్రాలు ఇచ్చినా, ఆందోళనలు చేసినా ఫలితం లేదన్నారు. అందుకే డీఎస్ఈ ఆఫీసు ముట్టడించాల్సి వచ్చిందని తెలిపారు. గురుకులాలతో సమానంగా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నా.. శ్రమకు తగ్గ వేతనాలివ్వడం లేదన్నారు. ఇప్పటికైనా కేజీబీవీ, యూఆర్ఎస్, ఎస్ఎస్ఏ ఉద్యోగుల న్యాయబద్ధమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సీహెచ్ దుర్గాభవాని, కోశాధికారి లక్ష్మారెడ్డి, కార్యదర్శులు శాంతికుమారి, నాగమణి, జ్ఞానమంజరి, వెంకట్, సింహాచలం, రేణుక, రవిప్రసాద్ గౌడ్, విశాలాక్షి, సుమన తదితరులు పాల్గొన్నారు.


సీఎస్​ను కలిసిన బృందం
కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్సీ నర్సిరెడ్డి నేతృత్వంలో ప్రతినిధి బృందం సెక్రటేరియెట్​లో సీఎస్ శాంతికుమారి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను కలిసి వినతిపత్రాలు అందించింది. విద్యాశాఖ అధికారులతో చర్చించి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా మరోసారి చర్చలకు సమయం ఇస్తామన్నారు.