
రాయ్ పూర్ : రేప్ కేసులో నిందితులు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులని ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ తెలిపారు. దాంతో పాటు మహిళలను లైంగికంగా వేధించినా, వారిపై ఇతర నేరాలకు పాల్పడినా ప్రభుత్వ ఉద్యోగాలు పొందకుండా నిషేధం విధిస్తామని ఆయన ప్రకటించారు. మంగళవారం 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాయ్ పూర్ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. మహిళల సంక్షేమం, భద్రతే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న 11, 12వ తరగతి విద్యార్థులు మెడికల్, ఇంజినీరింగ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి ప్రఖ్యాత ఇన్ స్టిట్యూట్లతో శిక్షణ ఇప్పిస్తామని వెల్లడించారు. స్కూల్ సిలబస్ లో మెషీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చేరుస్తామన్నారు. అలాగే ప్రభుత్వ కాలేజీ విద్యార్థులకు ఫ్రీ పిక్ అండ్ డ్రాప్ సౌకర్యం కల్పిస్తామని సీఎం ప్రకటించారు.