నిఠారీ హత్యల కేసులో నిందితులు నిర్దోషులే

నిఠారీ హత్యల కేసులో నిందితులు నిర్దోషులే

అలహాబాద్​ హైకోర్టు కీలక తీర్పు    
2006లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు

ప్రయాగ్​రాజ్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2006 నాటి నిఠారీ వరుస హత్యల కేసులో అలహాబాద్ హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. కింది కోర్టులో దోషులుగా తేలి, మరణశిక్ష ఎదుర్కొంటున్న నిందితులు సురేందర్ కోలీ, మానిందర్ సింగ్ పంథేర్ లను నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో వారిద్దరినీ నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు జస్టిస్ అశ్వని కుమార్​మిశ్రా, షారిజ్వీ ఆధ్వర్యంలోని డివిజన్​ బెంచ్​పేర్కొంది. నోయిడాలోని నిఠారీ గ్రామంలో 2005 నుంచి 2006 మధ్య వరుస హత్యలు జరిగాయి. వ్యాపారవేత్త అయిన మానిందర్​సింగ్ ​పంథేర్ ​ఇంటి పక్కన ఓ మురికి కాలువలో 2006 డిసెంబర్​లో ఓ వ్యక్తి శరీర భాగాలు కనిపించాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ఒకదాని తర్వాత ఒకటి వరుస హత్యలు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తులో పంథేర్ ఇంటి పెరట్లో చిన్నారులు, అమ్మాయిల అస్థిపంజరాలు బయటపడ్డాయి. అవన్నీ ఆ ప్రాంతంలో ఏడాదిగా మిస్​ అయిన పేద పిల్లలవేనని పోలీసులు నిర్ధారించారు. 

సీబీఐ దర్యాప్తు చేసి..

ఈ కేసును సీబీఐ టేకప్​ చేసింది. పంథేర్ ఇంట్లో పనిచేసే సురేందర్ కోలీ.. చిన్నారులకు స్వీట్లు, చాక్లెట్ల ఆశ చూపి ఇంటికి పిలిచి చంపేవాడు. ఆపై మృతదేహాలపై లైంగిక దాడి చేసేవాడని ప్రాథమికంగా రుజువైంది. ఆ తర్వాత శరీర భాగాలను ఇంటి వెనుక విసిరేశాడని సీబీఐ చార్జ్​షీట్​లో పేర్కొంది. దీంతో.. పంథేర్, సురేందర్ కోలీపై మొత్తం19 కేసులు నమోదయ్యాయి. అయితే, సరైన సాక్ష్యాలు లేవని వీటిలో మూడింటిని కోర్టు కొట్టేసింది. మిగతా వాటిపై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు.. కొన్ని కేసుల్లో సురేందర్ కోలీని దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. రెండు కేసుల్లో పంథేర్​ కూడా దోషిగా తేలడంతో అతడికీ ఉరిశిక్ష పడింది. 

అయితే, మరణశిక్షను సవాల్ చేస్తూ కోలీ, పంథేర్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లను ఇటీవల విచారించిన న్యాయస్థానం.. సోమవారం తీర్పు వెలువరించింది. సరైన ఆధారాలులేని కారణంగా కోర్టు వీరిని నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో ఈ కేసుల్లో వారి మరణశిక్ష రద్దయింది. అయితే నిఠారీ హత్యలకు సంబంధించి మరో కేసులో సురేందర్ కోలీ మరణశిక్షను గతంలో అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. ఇంకో కేసులో అతడి ఉరిశిక్షను జీవిత ఖైదుకు తగ్గించింది.