గద్దర్ ను కాల్చిన నిందితులను శిక్షించాలి

గద్దర్ ను కాల్చిన నిందితులను శిక్షించాలి
  • గద్దర్  ఫౌండేషన్ ప్రతినిధులు డిమాండ్ 
  • ఈనెల 6న ‘పాటపై తూటా’ కార్యక్రమం

ఓయూ,వెలుగు: ప్రజా గాయకుడు గద్దర్​పై కాల్పులు జరిపిన నిందితులను శిక్షించాలని గద్దర్​ ఫౌండేషన్​ ప్రతినిధులు డిమాండ్​ చేశారు. గద్దర్ చనిపోయేదాకా న్యాయం జరగలేదని, ఆయన త్యాగాలపై ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుని నిరక్ష్యం చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నెల6న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘ పాటపై తూటా’ ప్రోగ్రామ్ లో భాగంగా రూపొందించిన పోస్టర్​ను మంగళవారం ఓయూ ఆర్ట్స్​కాలేజీ వద్ద ఆవిష్కరించి మాట్లాడారు. 27 ఏండ్ల కిందట గద్దర్  పై కాల్పులు జరిపిన వారిని గుర్తించి శిక్షించడంలో అన్ని ప్రభుత్వాలు  నిర్లక్ష్యంగా వ్యవహరించాయని మండిపడ్డారు. 

గద్దర్ పై జరిగిన కాల్పులను మానవీయ కోణంలో ఆలోచించి నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని ‘పాటపై తూట’ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, జస్టిస్ చంద్రకుమార్,  ప్రొఫెసర్ కంచె  ఐలయ్య, డాక్టర్ పరకాల ప్రభాకర్, ఎడిటర్ కె. శ్రీనివాస్  హాజరవుతారని,  విశిష్ట అతిథులుగా గోరేటి వెంకన్న , జేబీ రాజు,  పాశం యాదగిరి,  విమలక్క తదితరులు మాట్లాడతారని గద్దర్ ఫౌండేషన్ మెంబర్, గద్దర్ కొడుకు గుమ్మడి సూర్య కిరణ్   తెలిపారు.  కార్యక్రమంలో  ఔటా కాంట్రాక్ట్​సంఘం అధ్యక్షుడు డాక్టర్ పరశురాం, డాక్టర్ ప్రేమయ్య, డాక్టర్  బాలకోటి,  డాక్టర్ రవి కుమార్,  డాక్టర్ వినీత పాండే పాల్గొన్నారు.