మళ్లీ అదే ప్రశ్న.. అదే అనుమానం.. అదే ఆందోళన. ఎన్నికల కమిషన్ పై కాంగ్రెస్ లేవనెత్తుతున్న ప్రశ్నలు ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. లేటెస్ట్ బీహార్ ఓటర్ లిస్టుపై కాంగ్రెస్ సంధించిన ప్రశ్న మళ్లీ సంచలనంగా మారింది. బీహార్ లో ఈసారి అధికార మార్పిడి జరుగుతుందని.. ప్రజలు తమ వైపే ఉన్నారని భావించిన కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి ఓటమి.. ఆ కూటమితో పాటు ఇతర పార్టీల నేతలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంత ఘోరంగా ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు.
అయితే లేటెస్ట్ గా ఫలితాలపై విశ్లేషణలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మరో సారి ఎన్నికల సంఘానికి సవాల్ విసిరింది. బీహార్ ఎన్నికల్లో షెడ్యూల్ ప్రకటించక ముందు విడుదల చేసిన ఓటర్ లిస్టులో ఉన్న ఓటర్ల సంఖ్య, పోలింగ్ తర్వాత రిలీజ్ చేసిన సంఖ్యకు చాలా గ్యాప్ ఉండటం కొత్త అనుమానాలకు తావిస్తోందని ఆపార్టీ ఆరోపించింది.
ఎన్నికల షెడ్యూల్ ముందు 2025 అక్టోబర్ 6న ఎన్నికల కమిషన్ (EC) రిలీజ్ చేసిన లిస్టు ప్రకారం ఆ రాష్ట్రంలో 7 కోట్ల 42 లక్షల ఓటర్లున్నారు. కానీ పోలింగ్ తర్వాత రిలీజ్ చేసిన లిస్టులో సంఖ్య 7 కోట్ల 45 లక్షల ఓటర్లకు చేరుకుంది. ఇదెలా సాధ్యమైందని కాంగ్రెస్ ప్రశ్నించింది. 3 లక్షల ఓటర్ల తేడా ఎలా వచ్చిందనేది ఆ పార్టీ ప్రశ్న.
ఈసీ స్పందన:
కాంగ్రెస్ ప్రశ్నపై ఈసీ స్పందించింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) లో భాగంగా సెప్టెంబర్ 30న విడుదల చేసిన లిస్టు ప్రకారం 7 కోట్ల 42 లక్షల ఓట్లున్నారని తెలిపింది. అయితే ఎలక్షన్స్ రూల్స్ ప్రకారం.. నామినేషన్ వేసే 10 రోజుల ముందు కొత్త ఓటర్లు అప్లై చేసుకునే వెసులుబాటు ఉందని తెలిపింది. అక్టోబర్ 1 నుంచి అప్లై చేసుకున్న కొత్త ఓటర్ల ద్వారా లిస్టులో సంఖ్య మారినట్లు చెప్పింది ఈసీ. రివైజ్ చేసిన లిస్టు ద్వారా 7 కోట్ల 45 లక్షలకు చేరుకున్నట్లు తెలిపింది.
పది రోజుల్లోనే 3 లక్షల కొత్త ఓటర్లు:
అయితే పది రోజుల్లో అప్లై చేసుకున్న ఓటర్లు వ్యాలిడ్ అయినందు వలన వారికి కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పింది ఈసీ. దీంతో మూడు లక్షల కొత్త ఓటర్లు వచ్చినట్లు పేర్కొంది.
ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి మహాఘటబంధన్ కేవలం 35 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది, కాంగ్రెస్ ఆరు సీట్లను గెలుచుకుంది, 19 నుండి సీపీఐ(ఎంఎల్) రెండు సీట్లు, సీపీఐ(ఎం) ఒక సీటు, సీపీఐ సున్నా సీట్లు గెలుచుకుంది.
మరోవైపు అధికార ఎన్డీఏ భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రజా వ్యతిరేకతను అధిగమించి ఆ కూటమి 202 స్థానాలను గెలుచుకుంది, బీజెపీకి 89, జెడియుకి 85, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 19, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థానీ ఆవామ్ మోర్చా 5, రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్‌వాహా లోక్‌సభకు 5 స్థానాలు లభించాయి.
