మూడోసారి అధికారంలోకి వస్తం.. మోదీ ధీమా

మూడోసారి అధికారంలోకి వస్తం..  మోదీ ధీమా
  • ఏప్రిల్ 1 తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతం:  మోదీ 
  • రాజకీయాల్లో కొందరిని ఎప్పటికీ లాంచ్​ చేయాల్సిందేనని రాహుల్​కు చురక
  • స్టార్టప్ మహాకుంభ్‌ కార్యక్రమంలో పాల్గొన్న  ప్రధాని

న్యూఢిల్లీ :  కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తంచేశారు. ఏప్రిల్​ 1 తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్​ను ప్రవేశపెడతామని అన్నారు. ఢిల్లీలోని భారత మండపంలో బుధవారం నిర్వహించిన ‘స్టార్టప్​ మహాకుంభ్’​లో ఆయన పాల్గొన్నారు. రాజకీయాల్లో కొందరిని ఎప్పటికీ లాంచ్​ చేస్తూ ఉండాల్సిందేనని కాంగ్రెస్​ నేత రాహుల్ ​గాంధీకి చురకలంటించారు. ‘స్టార్టప్​ ఎకోసిస్టమ్​ అనేది ప్రయోగాత్మకమైనది. ఏదైనా కారణంతో ఒక స్టార్టప్​ను ప్రారంభించడంలో విఫలమైతే మరోదానికి వెళ్లాల్సిందే. కానీ రాజకీయాల్లో అలా కాదు.. కొందరిని రిపీటెడ్​గా లాంచ్​ చేయాల్సిందే’ అని రాహుల్​ గాంధీని ఉద్దేశించి అన్నారు.

పుతిన్​కు మోదీ శుభాకాంక్షలు

రష్యా ఫెడరేషన్​ అధ్యక్షుడిగా ఐదోసారి ఎన్నికైన వ్లాదిమిర్​ పుతిన్​కు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.  ఈమేరకు బుధవారం పుతిన్​కు ఫోన్​ చేసిన మోదీ.. రష్యా–ఉక్రెయిన్​ వివాదం పరిష్కారానికి చర్చలు, దౌత్యమే మార్గమని సూచించారు. ‘ఈ రోజు పుతిన్​తో ఫోన్​లో మాట్లాడాను. రష్యన్​ ఫెడరేషన్​కు అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు 
అభినందనలు తెలిపాను. భారత్​, రష్యా మధ్య ఉన్న ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత లోతుగా విస్తరించేందుకు ఇద్దరం ఏకాభిప్రాయానికి వచ్చాం’ అని మోదీ ఎక్స్​లో వ్యాఖ్యానించారు. అలాగే, భారత్​లో రాబోయే సార్వత్రిక ఎన్నికలను మోదీ విజయవంతంగా నిర్వహించాలని పుతిన్​ ఆకాంక్షించినట్టు క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి. కాగా, ఫోన్​ సంభాషణలో మోదీ, పుతిన్​ కలిసి ద్వైపాక్షిక సహకారంలో పురోగతిని సమీక్షించారని, ప్రాంతీ య, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.