వాటర్ బోర్డు.. యాక్షన్​ప్లాన్

వాటర్ బోర్డు.. యాక్షన్​ప్లాన్
  • వచ్చే సమ్మర్​లో నీటి ఎద్దడి నివారణకు చర్యలు
  • అదనంగా 50 ఎంజీడీలు సరఫరాకు నిర్ణయం
  • అవసరమైన ప్రాంతాల్లో ట్యాంకర్లతో సప్లయ్​కు ఏర్పాట్లు
  • అదనంగా కొత్త ఫిల్లింగ్ ​స్టేషన్ల ఏర్పాటుకు అధికారులు సిద్ధం

హైదరాబాద్,వెలుగు :  వచ్చే వేసవిలో గ్రేటర్​సిటీలో నీటి సమస్యలు తలెత్తకుండా వాటర్​బోర్డు సమ్మర్ ​యాక్షన్​ప్లాన్​ రూపొందిస్తుంది. ప్రతి  వేసవిలో జంటనగరాలకు నీటి సమస్యలు వస్తుండగా.. ఈసారి ముందుగానే తగు ఏర్పాట్లను చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రత్యేకంగా బస్తీలు, కాలనీల్లో నీటి ఎద్దడి రాకుండా అన్ని చర్యలు తీసుకోనున్నారు. రెండు నెలల ముందు నుంచి ప్లాన్ తో ముందుకెళితే..  ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. జంటనగరాలు

ఔటర్​రింగ్​రోడ్​ ప్రాంతాల్లో కలిపి దాదాపు 2,800 చ.కి.మీ. పరిధిలో నీటి సరఫరా నిర్వహిస్తున్న మెట్రోవాటర్​బోర్డు తన పరిధిని కూడా  విస్తరించుకుంటుంది. అందుకు అనుగుణంగా కొత్తగా ఏర్పడే కాలనీలు, విల్లాలు టౌన్​షిప్​లకు సైతం పైప్​లైన్​ ద్వారానే నీటి సరఫరా చేస్తుంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం మెట్రోవాటర్​బోర్డు సేవలు భారీగా విస్తరించాయి. ఓఆర్ఆర్​ పరిధిలోనే కాకుండా అవతలి వైపు ప్రాంతాల్లోనూ నీటిని సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది.

ప్రస్తుతం 29 ఆపరేషన్​అండ్​మెయింటెనెన్స్​ డివిజన్లతో కలిపి ఔటర్​రింగ్​వెలుపలి మున్సిపాలిటీలు, గ్రామాలకు రోజుకు 550 మిలియన్​గ్యాలన్ల నీటిని అందిస్తుంది. ప్రతి ఏడాది సమ్మర్ వచ్చిందంటే చాలు వాటర్​బోర్డు పై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా నిర్దేశిత అన్ని ప్రాంతాలకు సరఫరా చేసేందుకు వాటర్​బోర్డు అధికారులు ప్రిపేర్ అవుతున్నారు. 

అదనంగా 50 ఎంజీడీలు సప్లయ్

గ్రేటర్​సిటీ పరిధిలోనే కాకుండా ఔటర్​రింగ్​రోడ్​పరిధిలోని గ్రామాలు, మున్సిపాలిటీలకు అందించేందుకు ప్రధాన వనరుగా ఉన్న గోదావరి, కృష్ణా ప్రాజెక్టు మూడు దశల నుంచి, సింగూరు, మంజీరా, హిమాయత్​సాగర్​, ఉస్మాన్​సాగర్​ జలాశయాల నుంచి నీటిని తరలిస్తున్నారు. ఈసారి సమ్మర్ లో భారీగా ఎండలు మండే పరిస్థితి ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా నీటి అవసరాలు బాగా పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

అందుకే ప్రస్తుతం సరఫరా అయ్యే 550 మిలియన్​గ్యాలన్లకు అదనంగా మరో 50 మిలియన్​గ్యాలన్లను తరలించాలని భావిస్తున్నారు. మార్చి నుంచి సమ్మర్​యాక్షన్​పనులు మొదలు పెడితే జులై వరకు కొనసాగించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లోని రిజర్వాయర్లతో పాటు ఓఆర్​ఆర్​పరిధిలో నిర్మించిన సర్వీసు రిజర్వాయర్లను కూడా వాడకంలోకి తీసుకొస్తామని అధికారులు తెలిపారు. 

సమ్మర్​ప్లాన్ లో ఏమేం చేస్తారంటే 

ఈసారి సమ్మర్ యాక్షన్​ప్లాన్​లో భాగంగా అన్ని ప్రాంతాల్లోని బోర్​వెల్స్​పనితీరును ముందుగానే పరిశీలించనున్నట్టు అధికారులు తెలిపారు. బోర్​వెల్స్​పనిచేయని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని తరలిస్తారు. ఇప్పటికే బోర్డు పరిధిలోని ట్యాంకర్లతో పాటు అదనంగా మరికొన్నింటిని అద్దెకు తీసుకోనున్నారు.  ప్రస్తుతం బోర్డు పరిధిలో 74 ఫిల్లింగ్​స్టేషన్లు ఉండగా, మరికొన్నిపెంచాలని నిర్ణయించారు.  ఔటర్​సమీపంలో నిర్మిస్తున్న సర్వీసు రిజర్వాయర్లలో చాలావాటిని ఇప్పటికే పూర్తి చేశారు. ఈసారి పూర్తిస్థాయిలో వాడకంలోకి తీసుకురావాలనుకుంటున్నారు.

ముఖ్యంగా నీటి సరఫరా జరిగే సమయాల్లో కరెంట్​పోతే ఇబ్బంది ఎదురవుతుంది. అలా జరగకుండా పంపింగ్​, వాటర్​ట్రీట్​మెంట్​నిర్వహించే ప్రాంతాల్లో విద్యుత్​సరఫరా ఆగిపోకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈసారి వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చేయాలనేదే తమ టార్గెట్ అని అధికారులు పేర్కొంటున్నారు. సమ్మర్​యాక్షన్​ప్లాన్​కు అవసరమైన నిధులను కూడా బోర్డు కేటాయిస్తుందని తెలిపారు.