ఇంటర్​ బోర్డ్​ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలి : చింతకాయల ఝాన్సీ

ఇంటర్​ బోర్డ్​ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలి : చింతకాయల ఝాన్సీ

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ ఎగ్జామ్ పేపర్స్ వాల్యుయేషన్ లో నిర్లక్ష్యం చేసి, స్టూడెంట్ల జీవితాలతో చెలగాటమాడిన ఇంటర్ బోర్డు ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని -ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ డిమాండ్ చేశారు. మార్కులు తారుమారు చేసి ప్రతిభావంతుల భవిష్యత్తును కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఇది ముమ్మాటికి ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యమేనని ఓ ప్రకటనలో వెల్లడించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల 2019లో  విద్యార్థుల ఆత్మహత్య ఘటనలు జరిగినప్పటికీ మళ్లీ అదే వైఖరి దేనికి సంకేతమని ఝాన్సీ ప్రశ్నించారు. తప్పిదాలు చేసి న్యాయం చేస్తామని హామీలు ఇస్తే సరిపోదన్నారు. పేద విద్యార్థులు రీ– వెరిఫికేషన్ కోసం ఫీజులు చెల్లించలేని స్థితిలో ఉన్నారని..మరి అలాంటివారికి న్యాయం ఎలా చేస్తారని ప్రశ్నించారు. పేపరు వాల్యుయేషన్​లో జరిగిన తప్పిదాలు అన్నింటినీ గుర్తించి, నష్టపోయిన విద్యార్థులందరికీ న్యాయం చేయాలని కోరారు. రీ– వెరిఫికేషన్ ఫీజును తిరిగి విద్యార్థులకు చెల్లించాలన్నారు. అదేవిధంగా వేలాది మంది విద్యార్థుల జీవితాలను చిక్కులో పడేసిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వానికి ఝాన్సీ రిక్వెస్ట్ చేశారు.