మెట్టుగూడ కానిస్టేబుల్‌‌పై చర్యలు

మెట్టుగూడ కానిస్టేబుల్‌‌పై చర్యలు

మెట్టుగూడలో సూర్య అనే వ్యక్తిని దారుణంగా కొట్టిన ఘటనలో పోలీసు అధికారులు సీరియస్ అయ్యారు. ఒక కానిస్టేబు‌‌ల్‌‌పై చర్యలు తీసుకున్నారు. కానిస్టేబుల్ శ్రీనాథ్‌‌ను హెడ్ క్వార్టర్స్‌‌కు హైద్రాబాద్ లా అండ్ ఆర్డర్ అడిషనల్ సీపీ చౌహన్ అటాచ్ చేశారు. వీడియో వైరల్ అయిన తర్వాత విచారణ చేపట్టారు. తర్వాత చర్యలు తీసుకున్నారు. కానీ... శ్రీనాథ్‌‌కి సహకరించిన మరో ముగ్గురు కానిస్టేబుల్స్‌‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. మెట్టుగూడలో జిమ్ ట్రైనర్ సూర్యపై పోలీసులు చేసిన దాడిపై జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అందరూ చూస్తుండగానే పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించడం వివాదాస్పదమైంది. బూట్లతో తన్నడం, దుడ్డు కర్రతో చితకబాదిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ బలంగా వినిపించింది. మరోవైపు ఈ సంఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది.  నివేదిక సమర్పించాలని DGPని ఆదేశించింది. 

బైక్ విషయంలో గొడవ : -
సికింద్రాబాద్  మెట్టుగూడలో బైక్ విషయమై ఇద్దరి మధ్య  గొడవ జరగడంతో  పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో  పోలీసులు మెట్టుగూడకు చెందిన జిమ్ ట్రైనర్ సూర్య ఆరోక్య రాజ్ ను విచారణకు రమ్మని ఆదేశించారు. ఉదయాన్నే వస్తానని ఆరోక్య రాజ్  చెప్పడంతో  చిలకలగూడ కానిస్టేబుళ్లకు ఎక్కడ లేని కోపం వచ్చింది. మొదట బూట్లతో  తన్నడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ట్రైనర్ ఎదురుతిరగడంతో వివాదం మరింత ముదిరింది. దీంతో సూర్యను దుడ్డు కర్రతో చితకబాదారు పోలీసులు. బస్తీవాసులు చూస్తుండగానే... థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ జిమ్ ట్రైనర్ సూర్యను బస్తీవాసులే గాంధీ హాస్పిటల్ కు తరలించారు. తీవ్రంగా కొట్టడంతో అతని కాలు విరిగింది. ప్రస్తుతం సూర్య ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. పోలీసులు తనను తీవ్రంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు సూర్య. కాలు విరిగేలా దుడ్డు కర్రతో కొట్టారన్నాడు. పోలీస్ స్టేషన్ కు రమ్మంటే వస్తానని చెప్పినా వినకుండా కొట్టారన్నాడు.

బస్తీ వాసుల నుంచి తీవ్ర వ్యతిరేకత :-
సూర్యను పోలీసులు దారుణంగా హింసించి కట్టెలు విరిగేలా కొట్టడంపై మెట్టుగూడ బస్తీ వాసుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నలుగురు పోలీసులు వచ్చి సూర్యని విపరీతంగా కొట్టారన్నారు. ఫిట్స్ ఉందని చెప్పినా కనికరించకుండా తీవ్రంగా హింసించారని మండిపడ్డారు. ఆపడానికి వెళ్లిన తమను తిట్టారని... వీడియోలు తీస్తుంటే మొబైల్స్ గుంజుకున్నారని మండిపడ్డారు. సూర్యకు ఏం జరిగినా పోలీసులదే బాధ్యత అంటున్నారున్నారు. విచక్షణారహితంగా దాడి చేసిన నలుగురు పోలీసులపై చర్యలు తీసుకోవాలని మెట్టుగూడ బస్తీవాసులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఒక్క కానిస్టేబుల్‌‌పై పోలీసు ఉన్నతాధికారులు తీసుకున్న చర్యలతో వారు సంతృప్తి చెందుతారా ? లేదా ? అనేది చూడాలి.