- మొదటి దశలో రెండు గ్రామాలు ఖాళీ చేయిస్తున్న ఆఫీసర్లు
- తర్వాత మిగతా 16 గ్రామాల తరలింపునకు చర్యలు
- తొమ్మిదేళ్ల ఎదురుచూపులకు తెర
నిర్మల్, వెలుగు: కవ్వాల్ టైగర్ రిజర్వ్ జోన్ పరిధిలోని అడవుల్లో ఏండ్లుగా బతుకుతున్న 18 గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు మొదలయ్యాయి. 2012 సంవత్సరంలో టైగర్ జోన్ పరిధిలోని గ్రామాలను దశలవారీగా తరలించాలని సర్కారు నిర్ణయించింది. మొదటి దశ కింద మైసంపేట, రాంపూర్ గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ గ్రామాల ఆదివాసీలకు పునరావాసం ప్యాకేజీని పూర్తిస్థాయిలో ప్రకటించకపోవడంతో గ్రామం విడిచి వెళ్లేందుకు నిరాకరించారు. గ్రామాల తరలింపు నిర్ణయాన్ని ఆదివాసీ, ప్రజా సంఘాలు వ్యతిరేకించాయి. అయితే కవ్వాల్ టైగర్ జోన్ లో పులులతోపాటు ఇతర వన్యమృగాల సంచారం పెరిగిపోతుండడంతో అక్కడ జనావాసాలు సురక్షితం కాదని అటవీశాఖ ప్రకటించింది. ఇక్కడి గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించాలని పలు కమిటీలు సైతం సిఫారసు చేశాయి. ఇందులో భాగంగా మొదటి దశ కింద టైగర్ జోన్ నుంచి విడిపోయేందుకు సిద్ధమైన మైసంపేట, రాంపూర్ గ్రామస్తులకు స్థిర నివాసాలతోపాటు వ్యవసాయ భూములను పునరావాసం కింద అందిస్తామని ప్రకటించారు. దాదాపు తొమ్మిదేళ్లపాటు పునరావాసంపై ఏకాభిప్రాయం కుదరకపోవడం, గిరిజనులు ఇతరచోట్లకు వెళ్లేందుకు నిరాకరించడం లాంటి అంశాలు సమస్యగా పరిణమించాయి. చివరకు ఒక్కో ఫ్యామిలీ యూనిట్ కు రూ. 15 లక్షల చొప్పున వన్ టైం సెటిల్మెంట్ పేరిట పునరావాస పరిహారాన్ని ఖరారు చేశారు. రూ. 15 లక్షల నగదు లేదా అంతే విలువైన ఇంటి స్థలం, వ్యవసాయ భూమిని అందించేందుకు అటవీశాఖ గిరిజనులను ఒప్పించింది.
పునరావాస ప్యాకేజీకి రూ. 22 కోట్లు
మైసంపేట్, రాంపూర్ గ్రామస్తులకు కడెం మండలంలోని మద్దిపడగ గ్రామం వద్ద పునరావాసం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. రెండు గ్రామాలకు చెందిన 142 కుటుంబాలను పునరావాసం కోసం ఎంపిక చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 14.2 కోట్లు మంజూరు చేసింది. మొదట్లో రూ. 10 లక్షలు మాత్రమే పరిహారంగా అందిస్తామని ప్రకటించిన అధికారులు గిరిజనుల ఒత్తిడి, ఆందోళనల కారణంగా పరిహారాన్ని రూ. 15 లక్షలకు పెంచారు. దీంతో మరో రూ. 7 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. 48 కుటుంబాలు రూ.15 లక్షల పరిహారాన్ని వన్ టైం సెటిల్మెంట్ కింద నగదు రూపంలో తీసుకునేందుకు అంగీకరించగా మరో 94 కుటుంబాలు మాత్రం పునరావాసం పొందేందుకు అంగీకరించాయి. ప్రస్తుతం ఈ 94 కుటుంబాలకు ఇళ్ల స్థలాలను మద్దిపడగ గ్రామం వద్ద కేటాయించారు. దీనికోసం సంబంధిత అధికారులు మద్దిపడగ గ్రామం వద్ద లేఅవుట్ కూడా రూపొందిస్తున్నారు. ఇంటి స్థలంతోపాటు వ్యవసాయ భూమి కోసం 112 హెక్టార్లు కేటాయించారు. మైసంపేట్, రాంపూర్ గ్రామాల పునరావాస ప్రక్రియ విజయవంతం అయితే రెండో దశ కింద మరో ఐదు గ్రామాలను కవ్వాల్ టైగర్ రిజర్వ్నుంచి తరలించాలని అధికారులు నిర్ణయించారు. ఈ రెండు గ్రామాలకు ఇచ్చినట్లుగానే మిగతా గ్రామాలకు పునరావాస ప్యాకేజీ అందించనున్నారు. తర్వాత మరో 11 గ్రామాలను సురక్షిత ప్రాంతానికి తరలించనున్నారు. గ్రామాలన్నింటినీ మైదాన ప్రాంతాలకు తరలించి కవ్వాల్ టైగర్ జోన్ లో ఒక్క ఆవాసం కూడా ఉండకుండా చర్యలు చేపట్టనున్నారు.
మానిటరింగ్ కమిటీ నేతృత్వంలో పనులు
జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని డిస్ట్రిక్ట్ లెవెల్ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో రాంపూర్, మైసంపేట గ్రామాల పునరావాసం, పరిహారం పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మద్దిపడగ గ్రామం వద్ద 94 కుటుంబాల పునరావాసం కోసం ఏర్పాట్లు చేస్తున్నం. ఇండ్ల స్థలాల లేఅవుట్ ప్రక్రియ పూర్తవుతోంది. మరో నెల రోజుల్లోగా మొత్తం పునరావాస ప్రక్రియ పూర్తవుతుంది. రెండో దశ కింద మరో ఐదు గ్రామాలను మైదాన ప్రాంతానికి తరలిస్తాం. తర్వాత మిగతా అన్ని గ్రామాలను మైదాన ప్రాంతాలకు తరలించే చర్యలు చేపడతాం.
- కోటేశ్వరరావు, ఎఫ్డీఓ, ఖానాపూర్
