1969 నాటి ఉద్యమకారులను గుర్తించాలి : కోదండరాం, ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్

1969 నాటి ఉద్యమకారులను గుర్తించాలి : కోదండరాం,  ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్
  • పెన్షన్, ఉచిత వైద్యం కల్పించి, 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి
  • తెలంగాణ ఉద్యమకారుల మహాధర్నాలో కోదండరాం,
  • ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్ డిమాండ్

ముషీరాబాద్,వెలుగు: తెలంగాణ సాధనకు జరిగిన ఉద్యమాలు అన్నింటిలోనూ తొలిదశ ఉద్యమమే కీలకమని 1969 ఉద్యమకారుల సంఘం పేర్కొంది. ఆనాటి ఉద్యమంలో 369 మంది అమరులయ్యారని, చాలామంది వారి జీవితంలో ఎంతో నష్టపోయారని అది పూడ్చలేనిది గుర్తు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర్య సమరయోధులుగా గుర్తించి 1969 ఉద్యమకారులను గౌరవించుకోవాలని కోరింది. మంగళవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో మహా ధర్నా చేపట్టారు. ప్రొఫెసర్ కోదండరాం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మల్లు రవి, జాజుల శ్రీనివాస్ గౌడ్, చక్రహరి రామరాజు హాజరై మాట్లాడారు.

రాష్ట్ర సాధన కోసం 1969లో తొలి దశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండి పడ్డారు. ఇప్పటికైనా తెలంగాణ సమరయోధులుగా గుర్తించి గుర్తింపు కార్డులు, పెన్షన్, ఉచిత వైద్యం, ఉచిత బస్ పాస్, గృహ వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. ఆనాటి ఉద్యమంలో పోలీస్ తూటాలకు బలైన 369 మంది  ఉద్యమకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు వనం చంద్రమౌళి, మారం సంతోష్ రెడ్డి, చంద్రారెడ్డి, సీతారాం రెడ్డి, శ్రీవాణి రెడ్డి, సుభద్ర తో పాటు 1969 ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.