మహా ప్రసాదం : 13 కోట్ల తిరుమల శ్రీవారి లడ్డూలు అమ్మకం

మహా ప్రసాదం : 13 కోట్ల తిరుమల శ్రీవారి లడ్డూలు అమ్మకం

కలియుగ వైకుంఠం తిరుమల విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఏటా తప్పకుండా తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకునేవారు చాలామంది ఉంటారు. శ్రీవారి దర్శనం కోసం ఎంత ఎదురుచూస్తారో లడ్డూ ప్రసాదం కోసం కూడా అంతే ఎదురు చూస్తారని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తిరుమల లడ్డూ ప్రసాదానికి ఉన్న ప్రత్యేకత అలాంటిది మరి. అందుకే తిరుమల లడ్డూ సేల్స్ ఏటా కోట్లలో ఉంటుంది. ఈ క్రమంలో 2025లో రికార్డు స్థాయిలో లడ్డూల విక్రయం జరిగినట్లు తెలిపింది టీటీడీ. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 13 కోట్ల 52 లక్షల లడ్డూలు విక్రయించినట్లు తెలిపింది టీటీడీ.

2024లో 12.15 కోట్ల లడ్డూలు అమ్మగా.. 2025లో 10 శాతం పెరిగి 13 కోట్ల 52 లక్షలకు చేరినట్లు తెలిపింది టీటీడీ.అంటే గ‌త ఏడాదితో పోల్చితే 1.37 కోట్ల ల‌డ్డూల‌ను ఈ ఏడాది అద‌నంగా భ‌క్తుల‌కు విక్ర‌యించ‌డం జ‌రిగిందని తెలిపింది. గ‌త ద‌శాబ్ద‌కాలంలో ఎన్న‌డూ లేనివిధంగా 2025 డిసెంబ‌ర్ 27వ తేదిన అత్య‌ధికంగా 5.13 ల‌క్ష‌ల ల‌డ్డూల‌ను భ‌క్తులు కొనుగోలు చేశారని... గత పదేళ్లలో ఇదే అత్యధిక విక్రయం అని పేర్కొంది టీటీడీ. 

టీటీడీ గత సంవత్సర కాలంగా ప్ర‌తిరోజూ 4 ల‌క్ష‌ల వరకూ ల‌డ్డూల‌ను త‌యారు చేస్తోందని... ముఖ్య‌మైన రోజుల్లో 8 ల‌క్ష‌ల నుండి 10 లక్షల ల‌డ్డూల వ‌ర‌కు భక్తలకు అందుబాటులో ఉంచుతోందని తెలిపింది.700 మంది శ్రీ‌వైష్ణ‌వ బ్ర‌హ్మ‌ణులు శ్రీ‌వారి పోటులో రెండు షిప్టుల్లో 24 గంట‌లు శ్ర‌మిస్తూ నియ‌మ‌, నిష్ట‌ల‌తో స్వామివారి ల‌డ్డూ ప్ర‌సాదాల‌ను త‌యారు చేస్తారని.. ఇటీవ‌ల కాలంలో ల‌డ్డూల నాణ్య‌త‌, రుచి పెర‌గ‌డంపై భ‌క్తులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారని తెలిపింది టీటీడీ.