పవన్ కు అలీ కౌంటర్ : డబ్బిచ్చారా.. సినిమాలిప్పించారా..!

పవన్ కు అలీ కౌంటర్ : డబ్బిచ్చారా.. సినిమాలిప్పించారా..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సంచలన కామెంట్స్ చేశాడు సినీ నటుడు, వైసీపీ నేత అలీ. రాజమండ్రి సభలో పవన్‌ కల్యాణ్‌ అలీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చాడు. తాను ఈ ఎన్నికల ప్రచారంలో పవన్‌ కల్యాణ్, లేదా ఆయన పార్టీ గురించి ఎక్కడా మాట్లాడలేదని అయినా.. పవన్ తననుద్దేశించి వ్యాఖ్యలు చేయడం తగదన్నాడు. ఈమేరకు సోమవారం రాత్రి  అలీ ఒక వీడియోను విడుదల చేశారు. పవన్‌ కల్యాణ్, తన అన్న చిరంజీవి వేసిన బాటలో పైకి వచ్చారని, కానీ.. తాను అలా కాదని తన కష్టంతోనే సినీ పరిశ్రమలో పైకొచ్చానన్నాడు. తనకేదో ఆయన సాయపడినట్లుగా చెప్పుకున్నారని, అది వాస్తవం కాదన్నాడు.

పవన్‌ సినీరంగంలోకి అడుగు పెట్టే నాటికే తాను పరిశ్రమలో ఒక స్థానం సంపాదించుకున్నానని గుర్తుచేశాడు అలీ. ‘ఏ రకంగా పవన్‌ నాకు సాయపడ్డారు. ఏమైనా సినిమాలు లేకుంటే ఇప్పించారా? కష్టాల్లో ఉంటే ఆదుకున్నారా? ..డబ్బు ఇచ్చారా.. ఇంకేమైనా సాయం చేశారా?’ అని అలీ  ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్‌ పార్టీ పెట్టినపుడు తాను ఆయన కార్యాలయానికి వెళ్లి ఖురాన్‌ ప్రతిని, ఖర్జూరాలను ఇచ్చి అభినందించి వచ్చానన్నాడు. ‘నేను వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరకూడదా ? అదేమైనా తప్పా? రాజ్యాంగ విరుద్ధమా?’ అని అలీ పవన్‌ను ప్రశ్నించాడు. తన చుట్టం టికెట్‌ అడిగితే ఇచ్చానని, అలాంటిది అలీ అడిగితే ఇవ్వనా అని పవన్‌ వ్యాఖ్యలు చేశారని… తన ఫోన్‌ నంబర్‌ ఆయన వద్ద లేదా? అని అలీ ప్రశ్నించాడు.