సెలబ్రెటీలైతే ఏమైనా తోపా..? జైల్లో ఫైవ్ స్టార్ ట్రీట్మెంట్‎పై సుప్రీంకోర్టు సీరియస్

సెలబ్రెటీలైతే ఏమైనా తోపా..? జైల్లో ఫైవ్ స్టార్ ట్రీట్మెంట్‎పై సుప్రీంకోర్టు సీరియస్

న్యూఢిల్లీ: అభిమాని హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‎కు బెయిల్ ఇచ్చిన కర్నాటక హైకోర్టుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శన్ బెయిల్ రద్దు చేసిన దేశ సర్వోన్నత నాయ్యస్థానం.. కర్నాటక హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని వికృతమైన, పూర్తి అనవసరమైన చర్యగా అభివర్ణించింది. హైకోర్టు బెయిల్ ఉత్తర్వుల్లో తీవ్ర చట్టపరమైన లోపం ఉందని, అది విచక్షణతో కూడిన ఏకపక్ష నిర్ణయం అని న్యాయమూర్తులు జెబీ పార్దివాలా, ఆర్ మహాదేవన్‎లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది.

కాగా, 2024 జూన్‎లో జరిగిన తన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో నటుడు దర్శన్ ప్రధాన నిందితుడు. తన ప్రియురాలు పవిత్రా గౌడకు అసభ్య సందేశాలు పంపించాడనే కారణంతో రేణుకా స్వామిని దారుణంగా హింసించి హత్య చేశాడన్న ఆరోపణలపై దర్శన్ ను గతేడాది పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో 2024, డిసెంబర్ 13న కర్నాటక హైకోర్టు దర్శన్‎కు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని కర్నాటక సర్కార్ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. 

Also read:-రేణుకాస్వామి మర్డర్ కేసు: కన్నడ నటుడు దర్శన్ బెయిల్ రద్దు చేసిన సుప్రీం కోర్టు..!

దర్శన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్లో కోరింది. ఈ పిటిషన్‎పై గురువారం (ఆగస్ట్ 14) విచారణ చేపట్టిన జెబీ పార్దివాలా, ఆర్ మహాదేవన్‎లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. కర్నాటక ప్రభుత్వ వాదనలతో ఏకీభవించి దర్శన్ బెయిల్ రద్దు చేసింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో దర్శన్‎కు బెయిల్ మంజూరు చేయడానికి ఎటువంటి చట్టపరమైన కారణం లేదని వ్యాఖ్యానించింది. నటుడికి కల్పించిన స్వేచ్ఛతో న్యాయ పరిపాలన పట్టాలు తప్పే ప్రమాదం ఉందని పేర్కొంది.

ఏ వ్యక్తి చట్టానికి అతీతం కాదని.. చట్టం ముందు అందరూ సమానమేనని నొక్కి చెప్పింది. జైల్లో దర్శన్ కు వీఐపీ ట్రీట్మెంట్ కల్పించడంపైన సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. జ్యుడిషియల్ కస్టడీలో దర్శన్‌కు ఎటువంటి ప్రత్యేక మర్యాదలు కల్పించరాదని రాష్ట్ర ప్రభుత్వం, జైలు అధికారులను ధర్మాసనం హెచ్చరించింది. నిందితుడికి జైలు ప్రాంగణంలో ఫైవ్ స్టార్ ట్రీట్మెంట్ అందిస్తున్నారని మాకు తెలిసిన రోజు జైలు సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.  

జైలులో పొగ త్రాగడానికి, మద్యం సేవించడానికి నిందితుడిని అనుమతించకూడదని హెచ్చరించింది. బెయిల్ మీద బయట ఉన్న దర్శన్‎ను త్వరగా కస్టడీలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. దర్శన్‎పై వచ్చిన ఆరోపణలు, ఫోరెన్సిక్ ఆధారాలను పరిగణలోకి తీసుకుని అతడి బెయిల్‌ రద్దు చేయాల్సిన అవసరాన్ని బెంచ్ నొక్కి చెప్పింది. ఇంత తీవ్రమైన కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేసి హైకోర్టు తప్పు చేసిందని.. హైకోర్టు చేసిన అదే తప్పును మేము చేయమని ధర్మాసనం పేర్కొంది.