కాంతార..మా ఊళ్లో కథ​ : రిషబ్​ షెట్టి

కాంతార..మా ఊళ్లో కథ​ : రిషబ్​ షెట్టి

రిషబ్​ షెట్టి.. ఈ పేరు టాలీవుడ్​కి కొత్త కావచ్చు. కానీ, కన్నడనాట చాలా ఫేమస్. నటుడిగానే కాక దర్శకుడు, రచయిత, నిర్మాతగా జీవితంలోనూ వివిధ పాత్రలు పోషిస్తుంటాడు. ‘కిరిక్​ పార్టీ’తో డైరెక్టర్​గా సక్సెస్ పార్టీ చేసుకుని, ‘బెల్​ బాటమ్​’తో హీరోగా హిట్​ కొట్టాడు. ‘మిషన్ ఇంపాజిబుల్​’లో గెస్ట్​రోల్​ ద్వారా టాలీవుడ్​కి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ‘కాంతార’ సినిమాతో పాన్​ ఇండియా ఆడియెన్స్​కు దగ్గరయ్యాడు. బాహుబలి, ఆర్​ఆర్​ఆర్​, కేజీఎఫ్​ సినిమాల్లా కాంతార కూడా కన్నడలో ఐకాన్​​గా మారింది. ఈ మల్టీ టాలెంటెడ్ హీరో పర్సనల్, ప్రొఫెషనల్ జర్నీ తన మాటల్లోనే..

‘‘నా అసలు పేరు ప్రశాంత్ షెట్టి. మాది కర్నాటకలోని కుందపురాలో ఉన్న కెరాడి అనే చిన్న గ్రామం. నాన్న భాస్కర్ షెట్టి జ్యోతిష్కుడు. నేను యావరేజ్​ స్టూడెంట్​ని కూడా కాదు. చిన్నప్పుడు ఐదో తరగతి ఫెయిల్​ అయ్యా. కానీ, పాస్​ అయ్యానని చెప్పి ఇంట్లోవాళ్లకి, ఫ్రెండ్స్​కి చాక్లెట్లు పంచా. వేసవి సెలవులు అయిపోయాక ఆరో తరగతి అడ్మిషన్​ కోసం వెళ్తే ఐదో తరగతి ఫెయిలయ్యా అని తెలిసింది మా వాళ్లకి. నా స్కూల్ డేస్ అలా గడిచాయి. ఆ తర్వాత ఎలాగో డిగ్రీ వరకు చదివా.  కాంతారలో చూపించినవన్నీ మా ఊళ్లో ఇప్పటికీ జరుగుతుంటాయి. మా ఫ్యామిలీ కూడా అందులో పార్టిసిపేట్ చేస్తుంది. కాబట్టి, అక్కడ జరిగే కంబాలా (బఫెల్లో రేస్) , జాతరలో వేసే కోలా గెటప్ చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగా. అప్పటి నుంచే నాటకాలు, సినిమాలంటే ఇష్టం ఉండేది. 

సీనియర్ నటుడు రాజ్ కుమార్, ఉపేంద్ర అంటే చాలా అభిమానం. మా ఊరి వాళ్లు బెంగళూరు వెళ్లి ఏదో సాధించారు. వాళ్లలా నేను కూడా ఏదైనా సాధించాలి అనుకునేవాడ్ని. దాంతో మా సిస్టర్ జాబ్ కోసం బెంగళూరు వెళ్తుంటే, తనతో పాటు నేను కూడా వెళ్లిపోయా. అక్కడ గవర్నమెంట్ ఫిల్మ్​ అండ్ టీవీ ఇనిస్టిట్యూట్​లో చేరా. మార్నింగ్ సిస్టర్​ని ఆఫీస్​ దగ్గర దింపేసి, అటు నుంచి హెసరఘట్టలోని సినిమా ఇనిస్టిట్యూట్​కి వెళ్లిపోయేవాడ్ని. అక్కడ క్లాస్​ అయిపోయాక, సాయంత్రం మళ్లీ సిస్టర్​ని తీసుకొని, ఇంటికెళ్లేవాడ్ని. ఆ టైంలో ఖర్చుకు డబ్బులు సరిపోయేవి కాదు. దాంతో అర్ధరాత్రి వరకు ఇంటింటికీ  తిరిగి వాటర్ బబుల్స్​ సప్లై చేసేవాడ్ని. అలా ఏ పని దొరికితే ఆ పని చేస్తుండేవాడ్ని. అలానే డైరెక్షన్​ డిప్లొమా పూర్తి చేశా. అంతకంటే ముందే నాటకాల కోసం కోస్టల్ కర్నాటక జానపద కళ అయిన యక్షగానలో ట్రైనింగ్ తీసుకున్నా. డిగ్రీ సెకండియర్​లోనే కుస్తీ, జూడోలో ప్రాక్టీస్ చేసిన ఎక్స్​పీరియెన్స్ ఉంది.
 
బాలీవుడ్​ ట్రయల్స్
హిందీ సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేయాలని ముంబై వెళ్లా. మూడు, నాలుగు నెలలు అక్కడే ఉన్నా. అందువల్ల నాకు హిందీ బాగానే వచ్చు. ‘గండ హెందతీ’ అనే కన్నడ సినిమాని హిందీలో ‘మర్డర్’గా రీమేక్ చేశారు. ఆ సినిమాకి నేను ఆఫీస్ బాయ్​గా, ప్రొడ్యూసర్​ కార్ డ్రైవర్​గా పనిచేశా. అక్కడ అంతకు మించి నా గ్రోత్ కనిపించలేదు. దాంతో బ్యాగ్ సర్దుకుని, ఇంటికెళ్లిపోయా. 

పేరు మార్చుకుంటే హీరో కావచ్చని..
కాలేజ్​ టైంలోనే కథలు రాసేవాడ్ని. నన్ను నేను హీరోగా ఊహించుకునేవాడ్ని. అలా సినిమా పిచ్చితో డిప్లొమా అయిపోగానే యాక్టింగ్ మొదలుపెట్టా. హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చా. కానీ, వచ్చిన వెంటనే ఎవరూ అవకాశం ఇవ్వరు కదా. దాంతో అందరిలానే మొదట క్లాప్ బాయ్, అసిస్టెంట్​ డైరెక్టర్​గా పనిచేశా. డైరెక్టర్ ఎ.ఎం.ఆర్ రమేశ్ తీసిన ‘సైనైడ్’ సినిమాకి అసిస్టెంట్​గా పనిచేయడం సినిమా ఫీల్డ్​లో మొదటి ఎక్స్​పీరియెన్స్. అప్పుడు నాకు తినడానికి తిండి, ఖర్చుకు డబ్బు దొరికాయి. సీనియర్ డైరెక్టర్స్​తో పరిచయాలు అయ్యాయి. కానీ, నటించే అవకాశాలు మాత్రం రాలేదు. నాటకాలు, షార్ట్ మూవీస్, సినిమాలు చేశా. కానీ, గుర్తింపు రాలేదు. నాలాగే ఇండస్ట్రీలో చాలామంది హీరో అవ్వాలని వచ్చి, అవకాశాల కోసం తిరగడం, ఒకటి రెండు సినిమాలు చేసినా, మూడో సినిమా ఆగిపోవడం.. ఇలాంటివన్నీ చూశా. దాంతో నా పరిస్థితి కూడా అలాగే అవుతుందేమోనని బాధపడేవాడ్ని. అయినా, సినిమా మీద ఆశ చావక, డబ్బు కోసం చిన్న పనులు చేస్తూనే అవకాశాల కోసం తిరిగేవాడ్ని. ఆ టైంలో ఒకతను నాకు న్యూమరాలజీ బుక్ ఇచ్చాడు. అది చదివాక పేరు మార్చుకోవాలనే ఆలోచన వచ్చింది. పేరు మార్చుకుంటే లైఫ్​ మారుతుందేమోనని ఆశ కలిగింది. వెంటనే నాన్నకు ఫోన్ చేసి ‘ నేను సినిమాల్లో ఎదగాలంటే నా పేరు మార్చుకోవాలి. మంచి పేరు చెప్పు’ అని అడిగా. అప్పుడు డా.రాజ్​ కుమార్, రజనీకాంత్​లా నా పేరు కూడా ‘ఆర్​’తో స్టార్ట్ అయితే బాగుంటుందని ‘రిషబ్’​గా మార్చారు మా నాన్న. 

వాళ్లు నా బెస్ట్ ఫ్రెండ్స్ 


రక్షిత్​ షెట్టి, రాజ్​ బి. షెట్టి నా బెస్ట్ ఫ్రెండ్స్. సినిమాలంటే మాకున్న ఇష్టం, సినిమా నాలెడ్జ్​ మమ్మల్ని ఫ్రెండ్స్ అయ్యేలా చేసింది. మా మధ్య ఎలాంటి ఈగోలు ఉండవు. ముగ్గురం కలిసి కథలు డిస్కస్ చేస్తాం. ఆలోచనలు పంచుకుంటాం. ఎవరు ఏ సజెషన్ ఇచ్చినా తీసుకుంటాం.​ ‘ఇది నా సినిమా, ఇది నీ సినిమా’ అని తేడా లేకుండా ఎవరి సినిమా అయినా ఒకేలా రియాక్ట్​ అవుతాం. ఒక మంచి సినిమా తీసుకురావాలనేదే మా లక్ష్యం. అలాగే ఈ సినిమాలోనూ వాళ్ల పాత్ర ఉంది. కథ అనుకున్నప్పుడు ఇద్దరికీ చెప్పా. ఇద్దరూ సజెషన్స్ ఇచ్చారు. టైటిల్ కూడా ముగ్గురం ఆలోచించి ఓకే చేశాం. ఇంకా చెప్పాలంటే.. ‘కాంతార’లో ఇంట్రడక్షన్​, క్లైమాక్స్ సీన్స్ చాలా బాగున్నాయని చెప్తున్నారు. ఆ క్రెడిట్​ అంతా రాజ్​ బి. షెట్టిదే. ఆ రెండు సీన్స్ తనే కొరియోగ్రఫీ చేశాడు. ఇప్పుడు వచ్చిన సక్సెస్​ని కూడా ముగ్గురం ఎంజాయ్ చేస్తున్నాం. 

కాంతార కథ పాతదే కానీ...


కొవిడ్ లాక్​డౌన్​లో వచ్చిన ఆలోచన ఇది. మా గ్రామానికి చెందిన​ ఒక యువకుడితో మాట్లాడుతుంటే.. వాళ్ల నాన్న జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పాడు. ఆ మాటల్లోనే ‘ఈ విషయాలు చాలామందికి తెలియవు కదా. సినిమాలో పెడితే ఎలా ఉంటుంద’ని ఆలోచించాం. దాంతో కొన్ని గంటల్లోనే సినిమాకి కావాల్సిన క్యారెక్టర్స్ గురించి అనుకున్నాం. మొదట ఒక రైతు, ఫారెస్ట్ ఆఫీసర్​ రోల్స్ అనుకున్నాం. అక్కడి నుంచి కథ డెవలప్​ చేశా. మరుసటి రోజు ఆ కథని నా ఫ్రెండ్స్​కి చెప్తే ‘బాగుంది’ అన్నారు. అప్పుడు ప్రొడ్యూసర్ విజయ్​ కిరంగదూర్​​కి ఈ కథని ఐదు నిమిషాల్లో చెప్పా. ఆయన ‘ఓకే’​ అన్నాడు. ఆ తర్వాత నేను మిగతా క్యారెక్టర్స్​ రాసుకున్నా. మనుషులు, ప్రకృతి మధ్య జరిగే ఒక కాన్​ఫ్లిక్ట్ తీసుకున్నా. 2004లో ఫస్ట్​ టైం ఒక మహిళను ఫారెస్ట్ సెక్యూరిటీ గార్డ్​గా పెట్టారు అని చదివా. దాంతో ఈ సినిమాలో మహిళా ఫారెస్ట్​ సెక్యూరిటీ గార్డ్ ఉంటే బాగుంటుందని హీరోయిన్​ రోల్​కి పెట్టా. మూవీలో కోస్టల్ కర్నాటక ప్రజల నేటివిటీ చూపించాలనుకున్నా. నేను పుట్టి, పెరిగిన ఊరు, అక్కడి ట్రెడిషన్స్ గురించి చెప్పాలనుకున్నా. ఈ కథ పాతదే కానీ, దీన్ని జానపద కథగా చూపించడానికి ట్రై చేశా. ప్రాంతీయ సినిమా ఎప్పుడూ యూనివర్సల్ సినిమానే అని నా నమ్మకం. దీన్ని సీక్వెల్ లేదా ప్రీక్వెల్ చేయడానికి స్కోప్​ ఉంది. అక్కడి వరకు ఆలోచించలేదు. ప్రస్తుతానికి రెండు నెలలు ఫ్యామిలీతో గడుపుతా. రక్షిత్​తో ‘కిరిక్​ పార్టీ –2’ చేయాలనే ఆలోచన కూడా ఉంది.  

ప్రొడ్యూసర్​గా ఎక్స్​పరిమెంటల్ ఫిల్మ్స్ చేయాలనుంది. కమర్షియల్ ఆడియెన్స్​కి పాత కథల్ని చెప్పాలనుంది. నటుడిగా అన్ని రకాల పాత్రల్లో నటించాలనే కోరిక కూడా ఉంది. డైరెక్టర్​గా అన్ని బౌండరీస్ దాటి మంచి కథలు చెప్పాలనుకుంటున్నా. కాంతార సినిమా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చూడదగ్గది. ఈ కాలంలో పిల్లలు మూలాలు మర్చిపోతున్నారు. ఈ మూవీ వాటిని గుర్తుచేస్తుంది. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా కాంతార’’: ప్రజ్ఞ

‘కాంతార’ కన్నడలో రిలీజ్​ అయిన సినిమా. ఇది పూర్తిగా రీజనల్ సినిమా. అక్కడి పల్లెల్లో ఉండే ఆచార వ్యవహారాలు, వాటి మూలాల గురించి చెప్పే సినిమా. అయితే, ఓటీటీకి వచ్చాక భాష అర్థం కాకపోయినా, ఇంగ్లీష్​ సబ్​టైటిల్స్​తో సినిమా చూశారు అన్ని భాషల ఆడియెన్స్. చూడ్డమే కాదు.. ఊహించని విధంగా పాజిటివ్​ రెస్పాన్స్ ఇచ్చారు. ఆ రెస్పాన్స్ చూసి ప్రొడ్యూసర్స్ ఆ సినిమాని మిగతా భాషల్లో డబ్ చేయాలని డిసైడ్ అయ్యారు. అనుకున్నట్టే డబ్ చేసి, రిలీజ్​ చేశాం. ఇక దాని రిజల్ట్ ఏంటో వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఇది కాంతార సినిమా ఇతర భాషల్లోకి రావడం వెనకున్న చిన్న కథ. 

2012లో రక్షిత్ షెట్టి నటించిన ‘తుగ్లక్ ’లో చిన్న పాత్రతో నటన మొదలుపెట్టాడు. తరువాత లూసియా, రిక్కీ, హోమ్ స్టే చిత్రాల్లో చేశాడు. 2014లో రక్షిత్ నటించిన‘ఉలిదవరు కండంతె’ ​సినిమాలో నటించాడు. 2016లో రక్షిత్​తోనే ‘రిక్కీ’ అనే సినిమా డైరెక్ట్ చేశాడు. దాని తర్వాత రక్షిత్​  కాంబినేషన్​లో కాలేజ్​ బ్యాక్​డ్రాప్​లో ‘కిరిక్​ పార్టీ’ తీశాడు. అందులో రష్మిక మందన్న నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు బెస్ట్ డైరెక్టర్​గా ఫిల్మ్​ఫేర్, సైమా అవార్డులు అందుకున్నాడు. తెలుగులో కూడా దాన్ని ‘కిరాక్​ పార్టీ’ పేరుతో రీమేక్​ చేశారు. నిజానికి కన్నడలో ఆ సినిమా చేసేటప్పుడు నిర్మాతతో ‘‘ఇది ఒక ఎక్స్​పరిమెంట్ మాత్రమే. దీని రిజల్ట్ ఎలా వచ్చినా.. ఏమనుకోవద్దు’’ అని చెప్పాడంట రిషబ్​. ఆయన ‘సరే’ అనడంతో సినిమా పట్టాలెక్కించాడు. అది థియేటర్​లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఆ సినిమా సక్సెస్​ రక్షిత్​కి, రిషబ్​కు మంచి బూస్ట్ ఇచ్చింది. ఆ సినిమా కథ.. రక్షిత్​, రిషబ్​ జీవితాల్లో జరిగినవి, వాళ్లు చూసిన సంఘటనల ఆధారంగా అల్లుకున్నారు. ఆ సినిమా సక్సెస్​ తర్వాత రిషబ్​ వెనుదిరిగి చూసుకోలేదు. ఆ మూవీ ఇచ్చిన ఎనర్జీతో  ఆ తర్వాత స్కూల్ పిల్లల బ్యాక్​డ్రాప్​లో ‘సర్కారీ హిరియా ప్రాథమిక శాలె’ అనే సినిమా తీశాడు. ఆ సినిమాకి రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్​ అతడే. దానికి నేషనల్ అవార్డ్ వచ్చింది. 2019లో హీరోగా ‘బెల్ బాటమ్’తో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా హిట్​ అవ్వడంతో హీరోగా సెటిల్​ అయ్యాడు.