ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో CID విచారణకు హాజరయ్యారు నటుడు ప్రకాశ్ రాజ్. 2025 నవంబర్ 12వ తేదీన సీఐడీ ఆఫీసులో సిట్ ఎదుట హాజరయ్యారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌పై పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్ లో నమోదైన FIR లను CID కి బదిలీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే జులై 30న ఈడీ విచారణ కు హాజరయ్యారు ప్రకాష్ రాజ్.
జంగిల్ రమ్మీ యాప్‌ను ప్రమోట్ చేసిన కేసులో ప్రకాష్‌రాజ్ ను విచారిస్తున్నారు CID అధికారులు. ఈ క్రమంలో తెలంగాణా సీఐడీ కార్యాలయం వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్, అందుకు సంబంధించిన చెల్లింపులు, ఒప్పందాలపై విచారించనున్నారు. ప్రకాశ్ రాజ్ వంటి సీనియర్ నటుడిని విచారించడం ఈ కేసు తీవ్రతను తెలియజేస్తోంది.
ఆర్థిక లావాదేవీల చిట్టాపై దృష్టి:
ప్రస్తుతం సిట్ అధికారులు దృష్టి అంతా ఆర్థిక లావాదేవీల చిట్టాపైనే ఉంది. ఈ ప్రమోషన్ల కోసం వచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఖాతాల్లో జమ అయింది, హవాలా మార్గాల ద్వారా ఏమైనా చెల్లింపులు జరిగాయా అనే అంశాలపై నిశితంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ప్రముఖులు కేవలం ప్రచార కర్తలుగానే ఉన్నారా, లేక వారికి అంతకుమించి ఏమైనా పాత్ర ఉందా అనే కీలక కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
విజయ్ దేవరకొండ స్టేట్మెంట్ రికార్డు:
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులలో ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ కు సీఐడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. నవంబర్ 11 న విజయ్ దేవరకొండ సిట్ ముందు హాజరవగా.. ఆయన నుంచి స్టేట్ మెంట్ రికార్డు చేశారు అధికారులు. విజయ్ తో పాటు యూట్యూబర్, నటి సిరి హనుమంతు కూడా 11న సిట్ ముందు హాజరయ్యారు. విజయ్ దేవరకొండను అధికారులు సుమారు రెండు గంటలపాటు, సిరి హనుమంతును ఏకంగా నాలుగు గంటలపాటు ప్రశ్నించారు.
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కోసం వారు తీసుకున్న భారీ మొత్తాలు, వాటి చెల్లింపు విధానం, యాప్ సంస్థలతో చేసుకున్న కాంట్రాక్ట్ వివరాలు, ఇతర ఆర్థిక లావాదేవీలపై ప్రధానంగా విచారణ జరిగింది. తమ ప్రమోషన్ల ద్వారా ఎంతమంది ప్రభావితమయ్యారు, దీని వెనుక ఉన్న ముఠాలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలోనూ సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.
సైబర్ నేరాలకు పాల్పడుతున్న అసలు ముఠాల వేటలో సిట్ దూకుడు పెంచడంతో, రాబోయే రోజుల్లో మరికొంతమంది ప్రముఖులు విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని, ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
