- మహిళా కమిషన్‌కు క్షమాపణ లేఖ ఇస్తానని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: దండోరా మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మహిళల దుస్తుల పట్ల తాను చేసిన వ్యాఖ్యలపై నటుడు శివాజీ బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించి క్షమాపణలు చెప్పారు. ఆ వేదికపై తాను రెండు అనుచితమైన పదాలు వాడినందుకు పశ్చాత్తాపం చెందుతున్నానని, ఆ మాటలు పూర్తిగా తప్పేనని ఆయన అంగీకరించారు. ఆ రెండు పదాలు అన్‌పార్లమెంటరీ వర్డ్స్ కాబట్టి అందరికీ సిన్సియర్‌గా క్షమాపణలు చెబుతున్నానని, కానీ తాను ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు మాత్రం కట్టుబడే ఉన్నానని స్పష్టం చేశారు. ‘‘నేను 30 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎప్పుడూ అలా మాట్లాడలేదు.
రాజకీయాల్లోనూ హద్దు మీరలేదు. కానీ భగవంతుడు ఎందుకలా చేశాడో, నా నుంచి ఆ పదాలు దొర్లిపోయాయి. ఆ విషయంలో చాలా బాధపడ్డా. బయటకు రాగానే పొరపాటుగా మాట్లాడానని గ్రహించాను. అందుకు సిన్సియర్‌గా క్షమాపణలు చెబుతున్నా. నేను ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు మాత్రం కట్టుబడే ఉన్నాను. దాంట్లో ఎవరికీ భయపడేది లేదు. నేను సరిగ్గా నిద్రపోయి 36 గంటలైంది.
నాపై నమ్మకంతో నిర్మాత అవకాశం ఇస్తే ఇలా జరిగిందని అంతర్మథనానికి లోనయ్యా”అని శివాజీ తెలిపారు. ‘‘ఇటీవల లులూ మాల్‌లో హీరోయిన్ నిధి అగర్వాల్ చాలా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవడం నా మైండ్‌లో నుంచి పోలేదు. నేను అలా మాట్లాడటానికి ఈ ఘటన ప్రధాన కారణం. ఎవరు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో చెప్పడానికి నేను ఎవర్ని? కానీ సినిమాల వల్లే ప్రపంచం నాశనం అవుతోందనే మాటలు వింటుంటాం. సినిమా ద్వారానే నా కుటుంబం బతుకుతోంది కనుక నా సినిమాను ఎవరూ ఏమీ అనకూడదనే ఉద్దేశంతోనే అలా మాట్లాడాను”అని చెప్పారు.
నాకంటే పెద్ద పదాలను ఎవరూ వాడలేదా?
అందరూ బూతులు మాట్లాడుకుంటారు కానీ, వేదికపై మాట్లాడేటప్పుడు ఓ పద్ధతి ఉంటుందని శివాజీ అన్నారు. ‘‘నేను ఎవరితో నటించినా, ఎప్పుడూ మిస్ బిహేవ్ చేయలేదు. జరిగిన తప్పుకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. నిధి అగర్వాల్ డ్రెస్ జారిపోయి ఉంటే.. ఆ వీడియోలు ఆమెను జీవితకాలం వేధించేవి.
నిధి అగర్వాల్ విషయంలో ఆడపిల్లలపై దాడి చేయడం సరికాదు అని ఒక్కరైనా అండగా నిలబడ్డారా? నేను మాట్లాడిన ఇంటెన్షన్ వేరు. నాకంటే పెద్ద పదాలను ఎవరూ వాడలేదా? నన్నే ఎందుకు ఇంతలా టార్గెట్ చేస్తున్నారు?” అని ఆయన ప్రశ్నించారు. ‘‘మనం మనుషులం.. పొరపాట్లు జరుగుతుంటాయి. అలాగని సమర్థించుకోవడం లేదు.
క్షమాపణలు చెప్పానని అన్నప్పటికీ విమెన్ కమిషన్ వాళ్లు ఈ నెల 27న రమ్మన్నారు. చట్టాన్ని గౌరవిస్తూ వెళ్లి క్షమాపణ లేఖ ఇస్తాను. నేనేం సిగ్గు పడను. హీరోయిన్లు ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు కాస్త మంచి బట్టలు వేసుకుని వెళ్లండని మాత్రమే అన్నాను. గుడ్ ఇంటెన్షన్‌తో మాట్లాడినా ఆ రెండు పదాలు మాత్రం తప్పే” అని శివాజీ అంగీకరించారు.
