నటుడు శుభలేఖ సుధాకర్ స్పెషల్ ఇంటర్వ్యూ..

నటుడు శుభలేఖ సుధాకర్ స్పెషల్ ఇంటర్వ్యూ..

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా, విలన్​గా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన నటుడు శుభలేఖ సుధాకర్. ఆయన శుభలేఖ సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు. ప్రస్తుతం ఆయన పలు చిత్రాల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో శుభలేఖ సుధాకర్ జీవితం గురించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. 

‌‌నమస్తే సార్.. ఎలా ఉన్నారు..​ఇప్పుడు మీరు ఏఏ ప్రాజెక్టులో చేస్తున్నారు? 
నేను బాగున్నాను.. ఇలా బాగుండడానికి మా శైలమ్మే కారణం. ప్రస్తుతం నలుగైదు సినిమాల్లో నటిస్తున్నాను. సినిమాల కంటే నన్ను ఎప్పుడూ ఆదుకున్నది మాత్రం టెలివిజన్​ సీరియల్స్. అందుకే నేను టెలివిజ్​ను ఎన్నడూ వదలుకోను.

‌‌మీరు పుట్టి పెరిగింది ఎక్కడ? విద్యాభ్యాసం ఎక్కడ పూర్తి చేశారు?
1960 నవంబర్ 19న వైజాగ్​లో జన్మించాను.. నా విద్యాభ్యాసం స్కూల్,కాలేజ్ అంతా వైజాగ్​లోనే పూర్తి చేశాను. చిన్నప్పటి నుంచి క్రికెటర్​ అవ్వాలని ఉండేది.. కానీ కాలేకపోయాను.. ఇక నటన విషయానికొస్తే.. అందరం చిన్నపుడు స్కూల్స్​లో కాలేజీలో చేస్తూనే ఉంటాం.. అలా ఓసారి కాలేజీ ఫంక్షన్​లో నాటకంలో నటించాను. అప్పడు అందరూ నన్ను గుర్తించారు.. అలా నటనపై ఆసక్తి పెరిగింది. నా స్ఫూర్తి అమితాబచ్చన్​గారు.. నేను కాలేజీలో టైంలో ఉన్నప్పుడు అమితాబ్​గారు స్టార్​హీరోగా దూసుకుపోతున్నారు. అప్పుడు ఆయన్ను చూసి సినిమాల వైపు వచ్చాను. నా మొదటి సినిమా శుభలేఖ. ఈ సినిమాతో శుభలేఖ ఇంటిపేరుగా మారిపోయింది.

అప్పట్లో హీరోలతో సమానంగా పాత్రలు చేశారు.. మరి మీకు రావాల్సినంత గుర్తింపు వచ్చిందనుకుంటున్నారా?
నేను సంతోషంగా ఉన్నాను.. ఇప్పటివరకు ఇంకా నటిస్తున్నాను.. సినిమా బ్యాగ్రౌండ్​లేని కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. అందుకు చాలా సంతోషంగా ఉంది. అది చాలు.

ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో  వచ్చిన మార్పులు ఏంటి ? సీనియర్ ​యాక్టర్​గా మీ అభిప్రాయం?
టెక్నాలజీ తప్ప ఏం మారలేదు.. ఫిల్మ్ ​మేకింగ్​ ఎప్పుడూ ఒకేలా ఉంది. అయితే ఇంత అడ్వాన్స్​టెక్నాలజీ ఉన్న టైంలో కూడా  సినిమా తీయడానికి ఎందుకు ఇంత సమయం పడుతోంది అనేది నా ప్రశ్న. అంటే ఆరోజుల్లో చిన్న బడ్జెట్ సినిమాలు 25 రోజుల్లో పూర్తి చేసేవారు. అది కూడా ఏ టెక్నాలజీ లేకుండా..అప్పుడు దర్శకుడికి కావల్సినట్టుగా షాట్ వచ్చిందా రాలేదా.. అని చూసుకునేవారు. అది మొత్తం రష్​ వచ్చాక ఎలా వచ్చిందని చూసుకునేవారు. కానీ ఇప్పుడు అంతా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. షాట్​ఎలా వచ్చిందని మానిటర్​లో చూసుకోవచ్చు. అయినా సినిమా పూర్తి కావడానికి చాలా సమయం పడుతోంది.

అప్పుడు వచ్చిన సినిమాలకు ఇప్పుడు వస్తున్న సినిమాలకు ఎలాంటి తేడాలు ఉన్నాయి?
తరాలు మారుతున్న కొద్దీ  సినిమా చూసేవారి అభిరుచులు మారుతున్నాయి.. మాకాలంలో చిరంజీవి,బాలకృష్ణ సినిమాలు చూసేవాళ్లం. మా కొడుకు జనరేషన్​లో మహేష్​ బాబు, బన్నీ సినిమాలు ఇష్టపడుతున్నారు. 

పాన్​ ఇండియా సినిమాపై మీ అభిప్రాయం ఏంటి?
పాన్​ఇండియా సినిమా అంటే ఏమీ లేదు.. సినిమా అంతే.. నా దృష్టిలో హిందీ సినిమాను తెలుగు రాష్ట్రంలో రెండు మూడు సార్లు చూడడం గొప్పతనం.. అంతేకాని తెలుగు డబ్​ చేసి చూస్తే ఏముంది. తెలుగు సినిమాను డబ్ చేయకుండా ఇతర భాషల వారు ఆదరించడం గొప్పతనం.   

సీరియల్స్, సినిమాలు రెండింట్లో ఎక్కువ ఆనందం దేంట్లో ఉంటుంది?
సీరియల్స్​ విషయానికొస్తే.. నా బాడీ లాంగ్వేజ్​ను బట్టి  వైవిధ్యమైన పాత్రలు ఇస్తుంటారు.. అయితే సినిమా వస్తే మాత్రం అన్ని పాత్రలు దొరక్కపోవచ్చు. ఎందుకంటే సినిమా అనే దానిలో కమర్షియాల్టీ ఉంటుంది. నాకు రెండింటిలోనూ హ్యాపీగా ఉంది. సీరియల్స్​లో పాత్రలు,సినిమాల్లో డబ్బులు,గుర్తింపు రెండూ ఉంటాయి. 

మీకు ఏదైనా పాత్ర ఇచ్చినప్పుడు దానికి న్యాయం చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
డైరెక్టర్​ ఇచ్చిన పాత్రను మన లైఫ్​లో ఉన్నట్లు జరుగుతుందని ఓన్​ చేసుకోవాలి.. అలాగే మనం చూసిన మంచి పాత్రలను అనుసరించడం చేస్తుంటాను. 

బాడీ బిల్డింగ్​కోసం అప్పట్లో హీరోలు ఏదైనా కసరత్తులు చేసేవారా?
అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. అప్పటి హీరోలు సంవత్సరానికి ఐదారు సినిమాలు చేసేవారు. కానీ ఇప్పటి హీరోలు సంవత్సరంలో ఒక సినిమా తీస్తున్నారు.. ఎందుకంటే సినిమాకు తగ్గట్టుగా హీరోలు బాడీని మార్చుకుంటున్నారు దీంతో కొంత టైం పడుతోంది. 

మీ కెరీర్​లో సంతృప్తినిచ్చిన పాత్ర ఏది?
ప్రతీ హిట్ ​సినిమా సంతోషాన్నిస్తుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు.. అయితే ఒక్కోసారి ఈ పాత్ర చాలా బాగుంది అనుకుంటాం కానీ వర్క్​​అవుట్ ​అవ్వవు.. అలాంటి సినిమా ‘గౌతమి’.. దాంట్లో మూగవాడి పాత్ర వేశాను. అయితే ఆ పాత్ర అనుకున్నంత సంతృప్తిని ఇవ్వలేదు.

 మీ దృష్టిలో మూవీ సక్సెస్​అంటే ఏంటి?
అందరి కృషి వల్లే సినిమా సక్సెస్​ అవుతుంది. 24 క్రాఫ్ట్స్ కలిసి సినిమాకు పని చేయాలి.. సినిమాను అనుకోవడం వేరు థియేటర్​లో ప్రజెంట్​ చేయడం వేరు. మనం చెప్పాలనుకున్నది.. చెప్పలేకపోవడం వల్ల సినిమాలు సక్సెస్​ కాలేకపోవచ్చు.  అందరూ కలిసి పని చేసినప్పుడే సినిమా సక్సెస్ ​అవుతుంది. ఇది నేను గట్టిగా నమ్ముతాను.

మీ సినీ జీవితంలో బాగా ఇబ్బందిపడ్డ సందర్భం ఉందా?
ఏ నటుడైనా హిట్ సినిమాలో చేశాక నెక్ట్స్​ స్టెప్​కు వెళ్తాడు.. అలా నాకు శివ మూవీ మంచి విజయాన్ని ఇచ్చింది.. అయితే ఆ సినిమా తర్వాత అవకాశాలు చాలా తగ్గిపోయాయి. 7 సంవత్సరాలు క్యారెక్టర్లు పడలేదు.. సంవత్సరానికి 10 రోజులు పని చేసేవాణ్ని. మిగితా రోజులు ఖాళీగా ఉండేవాణ్ని. అవి నాకు చాలా టఫ్​డేస్​. అప్పుడే నాకు పెళ్లైంది. శైలజ కూడా రోజు నాలుగు పాటలు పాడేది. ఆమెకు కూడా అవకాశాలు తగ్గాయి. ఆ టైంలో మా జీవితంలో ఇబ్బందికరమైన రోజలు.

ఇప్పుడు వస్తున్న ఓటీటీ సిరిస్​లపై అభిప్రాయం?
డిజిటల్​ ప్లాట్​ఫాంలో పనికి రాని వాళ్లందరిని పెట్టి సిరీస్ ​లు తీస్తున్నారు. మాకు చెప్పేది ఒకటి వాళ్లు తీసేది మరొకటి ఉంటుంది. 

ఇప్పుడొచ్చే ఆర్టిస్టులు ఎక్కువ కాలం రాణించలేకపోతున్నారు. కారణం ఏంటి?
వారికి తగ్గట్లు పాత్రలు రావడం లేదు. అప్పట్లో సినిమాల్లో ఎన్నో క్యారెక్టర్లు ఉండేవి..కానీ ఇప్పుడొస్తున్న సినిమాల్లో క్యారెక్టర్లు తగ్గిపోయాయి.. హీరో , హీరోయిన్ , ​విలన్​ అంతే.. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు.

మీ జీవితంలోకి శైలజ గారు ఎప్పుడు వచ్చారు.. బాలసుబ్రహ్మణ్యం గారితో అనుబంధం ఎలా ఉండేది?
చాలా మంది అనుకుంటున్నట్టుగా మాది లవ్​ మ్యారేజ్ ​కాదు.. పెద్దలు కుదిర్చిన పెళ్లి. మా పెళ్లికి సూత్రధారి జంధ్యాల గారు. శైలజ వాళ్ల ఇంటో సంబంధాలు చూస్తున్న టైంలో జంధ్యాలగారు నన్ను చూపించారు.  అలా ఇద్దరి ఇండ్లలో మాట్లాడుకొని 1989లో మా పెళ్లి జరిగింది. బాలుగారిని నేను సార్​ అనే పిలుస్తాను.

బాలుగారిని సార్ ​నుంచి బావ అనే సందర్భం వచ్చిందా?
బాలుగారు ఎన్నో సార్లు అడిగారు.. వారికి ఒక తమ్ముడు ఉన్నాడు ఆయన్ను బావ అని పిలుస్తాను.. సంగీత ప్రపంచంలో ఆయన గొప్పస్థానంలో ఉన్నాడు.. ఆ గౌరవం అలాగే ఉండిపోయింది. పెళ్లి కాకముందు ఎన్నో సార్లు కలిశాను.. అప్పుడు కూడా సార్​ అనే పిలిచేవాణ్ని. పెళ్లి అయ్యాక కూడా అలా పిలిచే అలవాటును నేను మార్చుకోలేకపోయాను. ఆయనతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. సార్​ను ఎవరైనా మొదటిసారి కలిసినప్పుడు ఆయనొక పెద్ద సింగర్​లాగా అభిప్రాయపడుతారు.. కానీ కొంతసేపు మాట్లాడాక.. చాలా సింపుల్​ వ్యక్తి అని అర్థం చేసుకుంటారు. ఆయన ఎంతో మంచి మనస్సుగలవారు.  

ఇద్దరూ సినీ రంగంలో ఉంటూ సక్సెస్​ఫుల్ ​కపుల్​ అనిపించుకున్నారు.. దీనిపై మీ అభిప్రాయం?
జీవితం అన్నది అర్ధం చేసుకోవడమే.. అది భార్యభర్త అనేకాదు.. ఎవరైనా అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది.

మీ ఫ్యామిలీ జీవితంలో సంతోషంగా ఉన్నారా?
ఏదైనా మనం తీసుకునేదానిపై ఆధారపడి ఉంటుంది. ఉన్నదాంట్లో తృప్తి పడాలి.

చివరిగా మిమ్మల్ని అభిమానించే ప్రేక్షకులకు మీరు చెప్పే సందేశం?
శిరస్సు వంచి అందరికీ పాదాభివందనం చేస్తున్నాను.. ఈ బక్క పలచని సుధాకర్​ను భరించి, అభిమానించి ఆదరిస్తున్నారు. అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.