ఒకప్పుడు హీరోయిన్‌గా ఆకట్టుకుని రీఎంట్రీలో మహారాజ, సరిపోదా శనివారం లాంటి చిత్రాలతో మెప్పించారు అభిరామి. రాజ్ తరుణ్ హీరోగా వస్తున్న ‘భలే ఉన్నాడే’ చిత్రంలో ఆమె మదర్‌గా నటించారు. జె శివసాయి వర్ధన్ దర్శకత్వంలో ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా అభిరామి ఇలా ముచ్చటించారు.
‘‘రీఎంట్రీ తర్వాత నేను తెలుగులో సైన్ చేసిన ఫస్ట్ సినిమా ఇదే. దర్శకుడు చెప్పిన కథ, నా క్యారెక్టర్ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాను. గౌరీ అనే బ్యాంక్ ఉద్యోగిగా కనిపిస్తా. సింగిల్ మదర్‌గా స్ట్రాంగ్ ప్రిన్సిపల్స్ ఉన్న మహిళ పాత్ర. తనలో సీరియస్‌నెస్‌తో పాటు హ్యూమర్, ఎమోషన్ ఉంటాయి. సినిమా మొత్తం కనిపించే పాత్ర. మదర్ అండ్ సన్ రిలేషన్‌షిప్ ఈ సినిమాకు సోల్. దర్శకుడు క్లియర్ విజన్‌తో తెరకెక్కించారు.
ఇక కెరీర్ విషయానికొస్తే..‘చెప్పవే చిరుగాలి’ షూటింగ్ తర్వాత డిగ్రీ చేయడానికి యూఎస్ వెళ్లా. తర్వాత కొన్ని ఆఫర్స్ వచ్చినా, యూఎస్‌లో ఉండిపోవడం వల్ల కుదరలేదు. పదేళ్ల క్రితం కమల్ హాసన్ గారు ‘విశ్వరూపం’లో హీరోయిన్ పాత్రకు డబ్బింగ్ చెప్పేందుకు నన్ను రప్పించారు.
అప్పటి నుంచి వరుస ఆఫర్స్ వస్తున్నా.. స్టోరీకి ప్రయారిటీ ఇస్తూ సెలక్టివ్‌గా చేస్తున్నాను. గత రెండేళ్ళలో పది సినిమాలు చేశా. టీవీ యాంకర్ నుంచి హీరోయిన్ అవడం మొదలు, తిరిగి రావడం వరకూ కెరీర్‌లో ఏదీ ప్లాన్ చేయలేదు. అదొక హ్యాపీ యాక్సిడెంట్.ప్రస్తుతం లీడ్ రోల్‌లో రెండు తమిళ చిత్రాలు చేస్తున్నా. అలాగే కమల్ హాసన్, మణిరత్నం గారి సినిమాలో నటిస్తున్నా. తెలుగులోనూ రెండు కథలు విన్నా. ఇంకొన్ని ఆసక్తికరమైన చిత్రాలు ఉన్నాయి’’.