మొదటి సినిమాతోనే వరుస అవకాశాలు

మొదటి సినిమాతోనే వరుస అవకాశాలు

అచ్చ తెలుగు అమ్మాయిలు టాలీవుడ్‌లో మంచి స్థాయికి వెళ్లరనే కామెంట్స్ ని ఆమె తప్పని నిరూపించింది. చక్కని చీరకట్టు.. పొడవాటి జడ.. కాటుక దిద్దిన కళ్లు..నుదుటిన బొట్టుతో ట్రెడీషనల్‌ లుక్‌లో కనిపిస్తూనే అందరినీ కట్టి పడేసింది. చారడేసి కళ్లతో కబుర్లాడేది. మంచి నటనతో మనసులు దోచేది. చైల్డ్ ఆర్టిస్ట్ గా  కెరీర్ స్టార్ట్ చేసి, హీరోయిన్‌గా సత్తా చాటిన తనే.. దివ్యవాణి. ఈరోజు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా దివ్యవాణి గురించి కొన్ని సంగతులు..

అనుకున్నదొకటి అయ్యిందొకటి..

ఉషావాణి. ఇదే దివ్యవాణి అసలు పేరు. గుంటూరు జిల్లా, తెనాలిలో కొర్రపాటి వారి కుటుంబంలో పుట్టారామె. అమ్మ, నాన్న,  అక్క,  అన్న, తను.. హ్యాపీ ఫ్యామిలీ. దివ్యవాణి అక్కయ్య చాలా అందంగా ఉండేది. దాంతో చూసినవాళ్లంతా ఆమెని హీరోయిన్‌ని చేయమని చెప్పేవారు. అదే మంచిదని అమ్మానాన్నలూ ఫిక్సయ్యారు. దివ్యవాణి తల్లి విజయలక్ష్మమ్మకి నటి శారద బాగా పరిచయం. దాంతో చెన్నై వెళ్లి ఆవిడని కలిశారు. అక్కడే సీన్ రివర్సయ్యింది. ఆవిడ దివ్యవాణిని చూసి తనని హీరోయిన్‌గా చేస్తే బాగుంటుందన్నారు. ఫొటో షూట్ కూడా చేయించారు. అవి పరిచూరి బ్రదర్స్ కి  నచ్చడంతో ‘సర్దార్ కృష్ణమనాయుడు’ మూవీలో హీరో కృష్ణకి కూతురిగా తీసుకున్నారు. అప్పటికి దివ్యవాణి వయసు పద్నాలుగేళ్లు. 

అనుకోకుండా ఒకరోజు..

మొదటి సినిమాతోనే అందరినీ ఇంప్రెస్ చేయడంతో దివ్యవాణికి వరుస అవకాశాలు వచ్చాయి.  కన్నడలో ‘డ్యాన్స్ రాజా డ్యాన్స్’ అనే మూవీలో నటించారు. అది సూపర్ హిట్. ఆ తర్వాత మరికొన్ని మూవీస్‌లో చాన్స్ వచ్చినా..ఎందుకో ఇండస్ట్రీ నచ్చలేదు. తనకు ఈ ఫీల్డ్ సరిపోదనిపించింది. దాంతో అన్నీ వదిలేసి తెనాలి వెళ్లిపోయారు. అయితే ఆమె ఇండస్ట్రీని వదిలినా ఇండస్ట్రీ ఆమెని వదల్లేదు. బాపు, రమణల రూపంలో అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది. ‘పెళ్లిపుస్తకం’లో హీరోయిన్‌ పాత్రకి తీసుకున్నామని, వెంటనే రమ్మని కబురు చేశారు. దాంతో ఆమె కెరీర్ ఊహించని మలుపు తిరిగింది. ఆ సినిమా సక్సెస్‌ కావడం, దివ్యవాణి నటనకు మంచి అప్లాజ్ రావడంతో అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ చాలా సినిమాలు చేశారామె. అనిల్ కపూర్ హీరోగా రూపొందిన ఒక హిందీ సినిమాలోనూ యాక్ట్ చేశారు. 

ఊహించని మలుపు

కెరీర్‌‌ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది. చేతి నిండా సినిమాలున్నాయి. అలా సాగిపోయి ఉంటే కథ వేరేలా ఉండేది. కానీ సరిగ్గా ఆ సమయంలోనే దివ్యవాణి ఓ పెద్ద స్టెప్ తీసుకున్నారు. బెంగళూరుకు చెందిన ఒక ఇండస్ట్రియలిస్ట్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటికామె వయసు ఇరవయ్యొక్కేళ్లు. పెళ్లయ్యాక కొన్నాళ్లు ఆనందంగానే గడిచింది. బాబు కిరణ్‌కాంత్, పాప తారుణ్య పుట్టారు. తర్వాత కొన్నాళ్లకు జీవితం ఊహించని మలుపు తిరిగింది. కాపురంలో కలతలు రేగాయి. దివ్యవాణి అంటే ఇష్టం లేని ఆమె భర్త బంధువులు ఆ దంపతుల మధ్య గొడవలు సృష్టించారు. ఆస్తిపాస్తుల కోసం తన బిడ్డని సైతం చంపడానికి ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు మొదలయ్యాయని, భయంతో వణికిపోయానని ఆ తర్వాత  కొన్ని సందర్భాల్లో చెప్పారామె. ఆ సమయంలో బాబు ఆరోగ్యం కూడా దెబ్బ తినడంతో ఏం చేయాలో తెలియక దేవుణ్ని ఆశ్రయించారు దివ్యవాణి. క్రిస్టియానిటీని స్వీకరించారు. ఎంతో భక్తిగా ప్రార్థనలు చేశారు. బాబు కోలుకున్నాక ఇక అక్కడ ఉండలేక పిల్లల్ని తీసుకుని మైసూర్ వదిలేసి చెన్నై చేరుకున్నారు.

ధైర్యంగా అడుగేసి..

తన పిల్లల కోసం భర్తకు దూరమైనా దేవుడికి దగ్గరయ్యానని, ఆ పరిస్థితుల్ని తట్టుకునే ధైర్యం ఆయనే ఇచ్చాడని చాలా సందర్భాల్లో చెప్పారు దివ్యవాణి. అయితే మానసిక ఒత్తిడికి కారణంగా థైరాయిడ్, ఒబెసిటీ లాంటి సమస్యలు చుట్టుముట్టాయి. విపరీతంగా బరువు పెరిగారు. అయినా నటిగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. సీరియల్స్ లో యాక్ట్ చేశారు. ‘రాధాగోపాళం’ సినిమాలోనూ నటించారు. ఆ సమయంలో దివ్యవాణిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎంతలా మారిపోయింది అని అనుకున్నారు. అయితే జీవితం విసిరిన సవాళ్లన్నింటినీ తాను సమర్థంగా ఎదుర్కొన్నానని చెబుతారు దివ్యవాణి. ఓ స్పెషల్ ట్రీట్‌మెంట్ ద్వారా తిరిగి స్లిమ్‌గా మారిపోయారామె. మళ్లీ ఎప్పటి దివ్యవాణిలా అందరి ముందుకీ వచ్చారు. ప్రస్తుతం సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాలిటిక్స్ లో ప్రవేశించి అక్కడా ఎదగాలని ప్రయత్నిస్తున్నారు.

ఉవ్వెత్తున ఎగసిపడిన అల మళ్లీ నేలమీద పడిపోతుంది. కానీ అలానే ఉండిపోదు. మరోసారి పైకి లేస్తుంది. మళ్లీ మళ్లీ ఎగసిపడుతుంది. దివ్యవాణి జీవితం కూడా అలానే అనిపిస్తుంది. హీరోయిన్‌గా మంచి స్థాయికి చేరుకున్నారు. వ్యక్తిగత జీవితం కారణంగా ఎన్నో చాలెంజెస్ ఫేస్ చేశారు. మళ్లీ తనను తాను నిలబెట్టుకుని తానేంటో చూపించాలని తపిస్తున్నారు. ఆమె ఆశలు, కలలు అన్నీ నెరవేరాలని కోరుకుందాం. ముందు ముందు ఆమె మరింత ఉన్నత శిఖరాలను అందుకుంటారని ఆశిద్దాం.